జనసేన అధినేత పవన్ కల్యాణ్… మందుగా చెప్పినట్లు ఈ నెల 14వ తేదీన.. ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేయబోతున్నారు. పవనిజం పేరుతో.. ఇంత కాలం.. హడావుడి చేసిన పవన్.. తన ఆలోచనలను మ్యానిఫెస్టో రూపంలో వెల్లడించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోరాటయాత్రను ఒక్క రోజుకే వాయిదా వేసి.. హైదరాబాద్ వచ్చిన పవన్… పార్టీ సీనియర్ నేతలతో రోజూ సమావేశమవుతున్నారు. ఈ సమావేశాల్లోనే… మ్యానిఫెస్టోకి ఓ రూపం ఇచ్చినట్లు తెలుస్తోంది. జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతునిచ్చిన పవన్ ఈసారి ఒంటరిగా పోటీ చేస్తానని పదే పదే చెప్తూ వస్తున్నారు. ఆగస్టు 15న జనసేన మ్యానిఫెస్టోను ప్రకటిస్తామని గతంలో పవన్ కళ్యణ్ ప్రకటించారు. అయితే దాని కంటే ముందు రోజు ఎన్నికల ప్రణాళికను ప్రకటించాలని నిర్ణయించారు.
జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మ్యానిఫెస్టోకి తుది రూపు ఇస్తోంది. విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పవన్ నిర్ణయించారు. విద్యపై పార్టీ విధాన కమిటీ రూపొందించిన ముసాయిదా పత్రంపై పీఏసీ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఎస్సీ, ఎస్టీ వెనుకబడిన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించేలా ప్రణాళికలుండాలని పీఏసీకి సూచించారు. ఈ మేరకు ఇతర దేశాల్లో అమలవుతోన్న విద్యా విధానాన్ని సైతం జనసేన వర్గాలు పరిశీలిస్తున్నాయట. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవటానికి సిద్దంగా ఉండాలని జనసేన పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు అధినేత పవణ్ కళ్యాణ్ పార్టీ శ్రేణులను సిద్దం చేస్తున్నారు. ఏడు జిల్లాలకు సంస్ధాగత నిర్వహణ కమిటీలను పవన్ కళ్యాణ్ నియమించారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు, ఉభయగోదావరి. కృష్ణ, గుంటూరు జిల్లాలకు పార్టీ సంస్దాగత కమిటీలను పవన్ నియమించారు. మిగతా వాటిపై కసరత్తు చేస్తున్నారు.
ఎన్నికలకు గట్టిగా మరో ఆరు నెలలు కూడా లేకపోవడంతో… మ్యానిఫెస్టో రిలీజ్ చేసి.. దాన్ని ప్రజల్లో చర్చకు పెట్టాలని జనసేన నేతలు నిర్ణయించారు. అది ఏ రూపంలో చర్చకు పెట్టాలా అన్నదానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ పవన్ కల్యాణ్ ఆగస్టు 14వ తేదీన మ్యానిఫెస్టో రిలీజ్ చేస్తే.. రాజకీయాల్లోకి వచ్చిన తరవాత ఆయన నిలబెట్టుకున్న మొట్టమొదటి మాట అదేనని చెప్పొచ్చని పలువురు జనసేన కార్యకర్తలు బహిరంగంగానే అనుకుంటున్నారు.