ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో తాజా రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. మంత్రి వర్గ విస్తరణ అనంతరం కొత్తగా పదవులు తెచ్చుకున్న మంత్రులు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి విమర్శలు చేయగా జనసైనికులు రెచ్చి పోయి సోషల్ మీడియా వేదికగా విమర్శల ప్రతి దాడి చేశారు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ ఎపిసోడ్ మొత్తంలో వైఎస్ఆర్సిపి ట్రాప్ లో జన సైనికులు పడ్డారని విశ్లేషిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
విమర్శలు తిప్పికొట్టడం లో, సోషల్ మీడియాను వినియోగించుకోవడంలో జన సైనికులు భేష్:
సోషల్ మీడియా వేదికగా తాజాగా జరుగుతున్న రాజకీయ విమర్శలు ప్రతి విమర్శల దాడి అన్ని రాజకీయ పార్టీల అభిమానులను విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. ప్రత్యేకించి ఇటీవల మంత్రి గుడివాడ అమర్నాథ్ లాంటి వారు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి వ్యక్తిగత విమర్శల దాడి చేయగా జన సైనికులు ధీటుగా సమాధానం ఇచ్చారు. గతంలో పవన్ కళ్యాణ్ ఫోటో కోసం గుడివాడ అమర్నాథ్ ఏ విధంగా తాపత్రయపడ్డారో ఆధారాలతో సహా నిరూపించారు. అయితే అమర్నాథ్ పప్పులో కాలు వేసిన చందంగా – పవన్ కళ్యాణ్ ఫోటో కోసం తాను తాపత్రయపడ లేదని , పవన్ కళ్యాణే తన తో ఫోటో దిగడం కోసం వచ్చాడని బుకాయించారు. అయితే జన సైనికులు కూడా గుడివాడ అమర్నాథ్ పాత వీడియోలు మొత్తం బయటకు తీసి రచ్చ రచ్చ చేశారు. కొందరు జనసేన అభిమానులు ఈ ఎపిసోడ్ మొత్తం చూసి జనసైనికులు స్పందించిన తీరు శభాష్ అంటూ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సిపి అనుంగు మీడియా సైతం మంత్రి అమర్నాథ్ అనవసరం గా తప్పులో కాలు వేశారని, అందువల్ల జనసైనికులు ఈసారికి పైచేయి సాధించారని విశ్లేషించారు.
కానీ ఇది వైఎస్ఆర్సిపి ట్రాప్ అంటున్న విశ్లేషకులు:
అయితే ఈ పరిణామాలను నిశితంగా పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు మాత్రం అనవసరంగా జనసైనికులు వైఎస్ఆర్సిపి ట్రాప్ లో పడుతున్నారని విశ్లేషిస్తున్నారు. వైయస్సార్ సిపి నేతలు ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం, దాంతో జనసైనికులు తమ శక్తియుక్తులు మొత్తం ఆ మంత్రి లేదా నాయకుడి వ్యక్తిగత జీవితం మీద ఫోకస్ చేయడం, కొన్నాళ్ళకు ఈ సంగతి పాత పడడం జరుగుతూ వస్తోందని వారు అంటున్నారు. ఇటీవల రుయా ఆస్పత్రిలో అంబులెన్స్ మాఫియా కారణంగా అంబులెన్స్ దొరకక చనిపోయిన కొడుకుని బైక్ పై 90 కిలోమీటర్లు తీసుకెళ్లిన తండ్రి ఉదంతం దేశవ్యాప్తంగా చర్చకు వస్తే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మంత్రి వర్సెస్ జనసైనికుల వ్యక్తిగత విమర్శల దాడి మాత్రమే హైలెట్ అయ్యింది. జన సైనికులు ఇదే స్థాయి లో తమ శక్తులన్నింటినీ ప్రజలను నిజంగా వేధిస్తున్న సమస్యలపై ఉపయోగించి వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగా నిలదీస్తే ప్రభుత్వానికి జరిగే డామేజ్ ఎన్నో రెట్లు ఎక్కువ గా ఉండే పరిస్థితి ఉన్నప్పటికీ వైఎస్ఆర్ సీపీ నాయకులు చాలా తెలివిగా జనసైనికుల ని ఎప్పటికప్పుడు వ్యక్తిగత విమర్శల అంశాని కి పరిమితం చేస్తూ ఉన్నారని ఈ పరిణామాలను సృష్టంగా పరిశీలించిన కొందరు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
మొత్తం మీద వైఎస్ఆర్సిపి నాయకులు ఏదో కంటగింపుగా పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం లేదని, రాష్ట్రంలోని ప్రధాన సమస్యల పై చర్చ జరగకుండా, ప్రజల మరియు మీడియా ఫోకస్ అటువైపు వెళ్ళకుండా డైవర్ట్ చేయడం కోసమే వ్యూహాత్మకంగా ఇటువంటి విమర్శలు చేస్తున్నారని జన సైనికులు మాత్రం పదే పదే వారి ట్రాప్ లో పడుతున్నారని వీరు విశ్లేషిస్తున్నారు. ఆ మధ్య రోడ్ల మీద గతుకులు సమస్యను జనసైనికులు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిన స్థాయిలో రాబోయే రెండేళ్లపాటు వేర్వేరు సమస్యల మీద ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం మీద ఫోకస్ చేయాలని, వైఎస్ఆర్ సీపీ నాయకుల ట్రాప్ లో పడి వ్యక్తిగత విషయాల మీద ఫోకస్ చేయడం వల్ల పార్టీ కి ఒనగూరేది ఏమీ ఉండదని వీరు విశ్లేషిస్తున్నారు. తదుపరి రెండేళ్లలో జనసైనికులు సమస్యలపై ఇదే స్థాయిలో సోషల్ యుద్ధం చేసి పార్టీని బలోపేతం చేస్తారా అన్నది వేచి చూడాలి