రవీంద్రనాధ్ ఠాగూర్ గీతం జనగణమన ప్రస్తుతం మన దేశానికి జాతీయగీతంగా ఉంది. కానీ ఈ జాతీయగీతం చుట్టూ ఇప్పుడు వివాదం రాజుకునే అవకాశం కనిపిస్తోంది. రవీంద్ర నాధ్ ఠాగూర్ దీనిని రాసినది బ్రిటిషు వారిని కీర్తిస్తూ, వారిని ప్రసన్నం చేసుకునే ఉద్దేశంతో మాత్రమేనని, అలాంటి గీతాన్ని జాతీయగీతంగాఉంచడం కరెక్టు కాదంటూ ఇప్పుడు కొత్త డిమాండు వినిపిస్తోంది. నిజానికి ఇది ఎంతో కాలంనుంచి ఉన్న డిమాండే. అసలే యావత్తు ప్రభుత్వంలో భాజపా (ఆరెస్సెస్) భావజాలాన్ని నింపడానికి చూస్తున్నదనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మోడీ సర్కారు ఈసారి రేగుతున్న అదే డిమాండుకు మరింత ఆజ్యం జతచేయవచ్చుననే వాదన వినిపిస్తోంది.
ప్రముఖ హిందీ కవి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత గోపాల్‌దాస్ నీరజ్ (92) తాజాగా జనగణమన జాతీయగీతం హోదాకు తగదంటూ తన అభిప్రాయాన్ని తెరపైకి తెచ్చారు. ఇది ఆంగ్లేయుల పాలన గుర్తుకు తెస్తుందని దాని బదులుగా వందేమాతరం లేదా ఝండా ఊంఛా రహే హమారా గీతాల్లో ఒకటి ఉండాలనేది ఆయన వాదన. 1911లో యూకే రాజుగా అయిదోజార్జ్ పట్టాభిషేకం సందర్భంగా ఆయనను కీర్తించడానికి రవీంద్రనాధ్ ఠాగూర్ భారత్ తరఫున ఈ గీతం రాశారని, అధినాయక అనే పదం ద్వారా రాజు నియంతృత్వాన్ని, ‘భారత భాగ్య విధాత’ యూకే రాజు అనే భావనను ఆ గీతం నిత్యం గుర్తుకు తెస్తుంటుందని ఆయన వాదిస్తున్నారు. పైగా గీతంలోని సింధ్ ప్రాంతం కూడా ఇప్పుడు భారత్లోలేదని అంటున్నారు. మన దేశపు బానిసత్వాన్ని గుర్తు చేసే ఈ గీతం కాకుండా వేరే గీతాలను జాతీయ గీతాలుగా ఎంచుకోవాలని అంటున్నారు.
నిజానికి ఇది ఎంతోకాలంగా ఆరెస్సెస్ చేస్తున్న వాదన కూడా. ఇప్పుడు ఇంత సీనియర్ కవి ఇదే అంశాన్ని తెరమీదకు తేవడంతో దేశవ్యాప్తంగా దీని మీద మేధావులు అభిప్రాయాలు పంచుకోవడమూ.. ప్రభుత్వం దీనికి ఆజ్యం జతచేసి జనగణమన విషయంలో పునరాలోచించే పరిస్థితి రావడమూ జరుగుతుందేమోనని పలువురు అంచనా వేస్తున్నారు. జాతీయతా వాదం ముసుగులో ఆరెస్సెస్ భావజాలాన్ని దేశంలో నింపడానికి మోడీ సర్కారు ప్రయత్నిస్తున్నదనే ఆరోపణలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జాతీయగీతానికి కూడా ముప్పు పొంచి ఉన్నదేమో అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.