తన డ్రీమ్ ప్రాజెక్ట్ `జనగణమన` అని ప్రకటించాడు పూరి జగన్నాథ్. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తీస్తానని అంటున్నాడు. కరణ్ జోహార్ లాంటి నిర్మాత దొరకడం పూరికి ప్లస్ పాయింట్. బాలీవుడ్ లో ఏ హీరో కావాలంటే ఆ హీరోని తీసుకొచ్చి ఇవ్వగలన కెపాసిటీ కరణ్‌కి ఉంది. కాబట్టి ఆ రకంగా ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాకపోవొచ్చు. అయితే ఈ సినిమా కథేంటి? ఈ సినిమాలో ఏ విషయాన్ని పూరి అడ్రస్ చేయబోతున్నాడు? అనేది ఆసక్తిని కలిగిస్తున్న అంశాలు.
నిజానికి ఇది మహేష్ కోసం రాసుకున్న కథ. ఇది వరకే మహేష్ కి వినిపించాడు. అప్పట్లో ఈ కాంబోలో జనగణమన వస్తుందని అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ.. కుదర్లేదు. అప్పట్లో రాసుకున్న పాయింట్ ని పూర్తిగా పక్కన పెట్టేసి, కొత్త ఐడియాతో ఈ కథని రాసుకున్నాడట. అది కరణ్‌కి బాగా నచ్చింది. టైటిల్ చూసి, ఈ సినిమా ఓ వీర జవాన్ కథ అనుకుంటున్నారు. కానీ… అసలు ఈ సినిమాలో మిలటరీ సెటప్పే లేదని తెలుస్తోంది. భారతీయులకు తమ బాధ్యత గుర్తు తెచ్చే సినిమా ఇదని, దేశాన్ని పట్టిపీడుస్తున్న అనేక సమస్యలు, వాటికి పరిష్కారాలూ తెరపై చూపించబోతున్నాడని తెలుస్తోంది. ఓ రకంగా ఇది శంకర్ ఆలోచనలకు దగ్గరగా ఉండబోతోంది. జెంటిల్మెన్, ఒకే ఒక్కడు, భారతీయుడు, శివాజీ.. ఒక్కో సినిమాలో ఒక్కో సమస్యని తెరపైకి తీసుకొచ్చాడు శంకర్. అయితే `జనగణమన`లో ఇవన్నీ టచ్ చేస్తూనే, ఊహకు అందని కన్‌క్లూజన్ ఇవ్వబోతున్నాడట. ఒక్క మాటలో చెప్పాలంటే, దేశభక్తి రగిలించే కథ ఇదని, అందుకే పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించబోతున్నాడని తెలుస్తోంది.