Janaka aithe ganaka movie review
తెలుగు360 రేటింగ్: 2.75/5
మధ్య తరగతి జీవితాల్లోకి తొంగి చూస్తే బోలెడు ఎమోషన్స్ కనిపిస్తాయి. రాసే తెలివే వుండాలి కానీ ప్రతి ఎమోషన్ ఒక కథే. అందుకే ఫ్యామిలీ సినిమా అనగానే రచయిత కలం మధ్య తరగతి గడప వైపు కదులుతుంది. సుహాస్ హీరోగా దిల్ రాజు సమర్పణలో వచ్చిన ‘జనక అయితే గనక’ కూడా మిడిల్ క్లాస్ స్టోరీనే. నేటితరం జంటలు పెళ్లి తర్వాత పిల్లల్ని కనడానికి ఎందుకంతగా ఆలోచించాల్సి వస్తోందనే అంశాన్ని, మధ్య తరగతి జీవితాల్ని నేపథ్యంగా తీసుకుని ఈ కథని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి బండ్ల. మరీ ప్రయత్నం వినోదాల్ని పంచిందా? దర్శకుడు చెప్పదలచుకున్న పాయింట్ మనసుల్ని హత్తుకుందా?
ప్రసాద్(సుహాస్)ది మిడిల్ క్లాస్. తనకు పిల్లల్ని కనడం పట్ల ఒక క్లారిటీ వుంటుంది. పిల్లల్ని కంటే వాళ్ళకి ది బెస్ట్ ఇవ్వాలి, లేదా కనడమే మానేయాలనేది అతడి ఫిలాసఫీ. 30వేల జీతానికి పని చేసే ప్రసాద్ ది బెస్ట్ ఇచ్చే స్తోమత వుండదు. అందుకే పెళ్లయి రెండేళ్ళు అవుతున్నా పిల్లల జోలికి వెళ్ళడు. ప్రసాద్ భార్య(సంగీత విపిన్) తన మనసుని అర్ధం చేసుకుంటుంది. ఇంట్లో మాత్రం పిల్లలు ఎప్పుడని గోల చేస్తుంటారు పేరెంట్స్. ఈ రోజుల్లో ఓ పిల్లాడని పెంచాలంటే కోటి రూపాయిలు కావాలని ప్రాక్టికల్ చూపిస్తాడు ప్రసాద్. దీంతో ప్రసాద్ తండ్రి (గోపరాజు రమణ) కూడా సైలెంట్ అయిపోతాడు. ఐతే అనూహ్యంగా ప్రసాద్ భార్య నెల తప్పుతుంది. దీంతో కుటుంబ నియంత్ర కోసం వాడుతున్న కండోమ్ సరిగ్గా పని చేయలేదని ఆ కంపెనీ పై కేసు వేస్తాడు ప్రసాద్. తర్వాత ఏం జరిగింది? ఈ కేసులో ఎలాంటి వాదోపవాదాలు జరిగాయి? కోటి రూపాయిలు నష్టపరిహారం చెల్లించాలని పట్టుబడ్డిన ప్రసాద్ ఈ కేసుని గెలిచాడా లేదా? అనేది మిగతా కథ.
కొన్ని ఐడియాలు భలే గమ్మత్తుగా అనిపిస్తాయి. ఐడియా వినిపించిన వెంటనే ‘సూపర్.. ఇలాంటి పాయింట్ ఎప్పుడూ రాలేదు’ అనే ఫీలింగ్ ని క్రియేట్ చేస్తాయి. అయితే ఆ ఐడియాని సినిమాగా మార్చడంలోనే అసలు పనితనం బయటపడుతుంది. ఐడియా బావుంటే అది ట్రైలర్ లో టీజ్ చేయడానికి బావుంటుంది కానీ పూర్తి స్థాయి సినిమాని నిలబట్టేగలిగేది ఐడియాకి ఇచ్చిన ట్రీట్మెంటే. జనక అయితే గనక ఐడియా క్యాచిగానే వుంది. కండోమ్ కంపెనీ మీద కేసు పెట్టడం అనే ఆలోచన ఆసక్తికరమైనదే. అయితే ఆ ఐడియాని స్క్రీన్ ప్లేగా మార్చి సినిమాగా చూపించడంలోనే కొంత ఇబ్బంది ఎదురైయింది.
ట్రైలర్ లోనే ఐడియాని ప్రజెంట్ చేసినప్పుడు.. సినిమాలో ఆ పాయింట్ వీలినంత స్పీడ్ గా ఓపెన్ చేయాలి. ఇందులో ఆ పాయింట్ ఇంటర్వెల్ ముందు గానీ ఓపెన్ అవ్వదు. అప్పటివరకూ ఏదో టైం పాస్ వ్యవహారంలా సన్నివేశాల్ని నడిపిన తీరు జస్ట్ ఓకే అనిపిస్తుంది. భార్య భర్తల ఎమోషన్ బిల్డ్ చేయడానికి చాలా రన్ టైం తీసుకున్నాడు. పోనీ ఆ తర్వాత అయినా పాయింట్ లోకి వెళ్ళలేదు. ప్రసాద్ పాత్ర చేసే జాబ్ చుట్టూ చాలా సన్నివేశాలు నడిపేశాడు. అవి అంత ఉత్సాహంగా రాలేదు. ఈ రోజుల్లో పిల్లల్ని కనాలంటే ఎంత ఖర్చు అవుతుందని ప్రాక్టికల్ గా చూపించిన సీక్వెన్స్ మాత్రం కథకు పనికొచ్చేదే. ఇంటర్వెల్ ఎపిసోడ్ ఆసక్తికరంగానే వచ్చింది.
ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొంత బెటర్. మురళీశర్మ కోర్ట్ డ్రామాలోకి వచ్చిన తర్వాత కథలో డ్రామా ఆసక్తికరంగా మారుతుంది. అయితే ప్రసాద్ భార్య కోర్టులోకి వచ్చిన వాంగ్మూలం ఇస్తే కేసు ముగిసిపోయినట్లే. ఇంతదానికి కావాల్సినదాని కంటే ఎక్కువ సాగదీశారనే ఫీలింగ్ కలుగుతుంది. పైగా కోర్ట్ రూమ్ డ్రామాలో బలం లేదు. మురళిశర్మ కోటికి బదులు ఐదు లక్షలు ఇప్పిస్తామనే సీక్వెన్స్ మరీ బలహీనంగా వచ్చింది. రూపాయి నష్టపరిహారం చెల్లించినా కేసు ఓడిపోయినట్లే. అలాంటి సందర్భంలో ఐదు లక్షలకు బేరం పెట్టడం వీక్ రైటింగ్ అనిపిస్తుంది. అదే కాదు.. స్కూల్, హాస్పిటల్ ఫీజులు తగ్గించమని డిమాండ్ చేయడం ఈ కథతో అంతగా ముడిపడని అంశం.
మీ వంశంలోనూ, మా వంశంలోనూ విన్నర్స్ ఎవరూ లేరు, అందరూ లూజర్సే. అలాంటప్పుడు పిల్లల్ని కనడం ఎందుకు? అంటూ హీరో చేసే ఆర్గ్యుమెంట్ లాజిక్ కి చాలా దూరంగా ఉంటుంది. ఈరోజుల్లో పిల్లల్ని కనడానికి ఆర్థిక స్థోమత అడ్డు రాదు. కేవలం పెంచడానికి మాత్రమే వస్తుంది. ఈ విషయాన్ని దర్శకుడు తప్పుగా అర్థం చేసుకొన్నాడేమో అనిపిస్తుంది.
సుహాస్ కి ఇలాంటి క్యారెక్టర్స్ కొత్త కాదు. పైగా ఇలాంటి మిడిల్ క్లాస్ పాత్రలు ఎక్కువైపోతున్నాయి. తనకి ఓ సహజమైన శైలి ఉన్నప్పటికీ చాలా చోట్ల రెగ్యులర్ గా కనిపిస్తాడు. పైగా సుహాస్ పాత్రని ఆడియన్ కనెక్ట్ చేసుకునేలా తీర్చిదిద్దలేదనిపిస్తుంది. అతని ఎమోషన్ తో చాలా మందికి కనెక్షన్ ఏర్పడదు. దీని కారణం సుహాస్ క్యారెక్టర్ ని అనిశ్చితిగా రాయడమే. పిల్లల విషయంలో కేవలం ఖర్చుని మాత్రమే చూస్తాడు కానీ ఎమోషన్ పక్కన పెట్టేసే క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ చివరిలో టర్న్ అయిన విధానం కూడా అంత సహజంగా అనిపించదు. పైగా పిల్లల విషయంలో తన ధోరణి ఆక్షేపనీయంగా వుంటుంది. తమ కుటుంబాల్లో ఎవరూ గొప్ప వాళ్ళు లేరు కాబట్టి పిల్లల్ని కనడం ఎందుకని ఓ చోట ప్రసాద్ పాత్ర ప్రశ్నిస్తుంది. ఇలాంటి క్యారెక్టర్ మిడిల్ క్లాస్ మిక్స్ అవ్వదు. సంగీత విపిన్ హుందాగా నటించింది. గోపరాజు రమణ, వెన్నెల కిశోర్ కొన్ని నవ్వులు పంచాడు. అప్పటి వరకూ అసమర్థ లాయర్ గా చూపించిన ఆ పాత్రని.. చివర్లో ఎగ్రసీవ్ చేయడం బాగుంది. కండోమ్ కిషోర్ అనే బిరుదు ఇవ్వడం, బిరుదు ఎలా ఉంది? అని అడిగితే… ఈ బిరుదు నీ పిరుదు లా ఉంది అంటూ వెన్నెల కిషోర్ స్టైల్ లో సెటైర్ వేయడం థియేటర్లో నవ్వులు పంచుతాయి. మురళిశర్మ సెకెండ్ హాఫ్ లో ఎంతోకొంత డ్రామాని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. రాజేంద్ర ప్రసాద్ న్యాయమూర్తి పాత్రలో ఓవర్ ది బోర్డ్ పెర్ఫార్మెన్స్ చేస్తూ కనిపించడం అంతగా నప్పలేదు.
టెక్నికల్ గా సినిమా ఓకే అనిపిస్తుంది. విజయ్ బుల్గానిన్ పాటలు రిజిస్టర్ కాలేదు కానీ నేపధ్యం సంగీతం మాత్రం పర్వాలేదనిపిస్తుంది. అయితే కొన్ని సీన్స్ లో కావాల్సిన దాని కంటే లౌడ్ గా చేశాడు. సాయి శ్రీరామ్ కెమెరాపనితనం డీసెంట్ అనిపిస్తుంది. ఇల్లు, కోర్టు చుట్టూ నడిచిపోయే సినిమా. ప్రొడక్షన్ వాల్యూస్ కథకి తగ్గట్టుగా వున్నాయి. గుర్తుపెట్టుకునే మాటలైతే లేవు. దర్శకుడు ఓ మంచి ఐడియానే పట్టుకున్నాడు. కానీ ఐడియాలో వున్న ఆసక్తి సినిమాలో కనిపించలేదు. ఐడియాలోని కోర్ ఎమోషన్ ని బలంగా చుపించినట్లయితే సినిమా ఇంకాస్త బెటర్ గా వుండేది. అయితే ఇప్పటికీ ఈ సినిమాకి ఢోకా లేదు. ఎక్కడ లైన్ దాటినా అపహాస్యం అయిపోయే ప్రమాదం ఉన్న పాయింట్ ఇది. దాన్ని వీలైనంత డీసెంట్ గా ట్రీట్ చేశారు. కామెడీ సెటప్, వెన్నెల కిషోర్ టైమింగ్.. ఈ సినిమాని నడిపించేస్తాయి. చివర్లో బామ్మ ఇచ్చిన ట్విస్ట్ అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంది. అదేంటో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
తెలుగు360 రేటింగ్: 2.75/5