పోలీసు అధికారుల సంక్షేమం సంఘం తరపున జనకుల శ్రీనివాసరావు అనే వ్యక్తి మరోసారి తెరపైకి వచ్చారు. ప్రెస్మీట్ పెట్టి జగన్ పై విరుచుకుపడ్డారు. పోలీసుల బట్టలూడదీస్తానని జగన్ అంటున్నారని మండిపడ్డారు. చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించని వారికి తాము సెల్యూట్ చేయబోమని.. జగన్ ఆ జాబితాలో కనిపిస్తున్నారని హెచ్చరించారు. ఈ జనకుల శ్రీనివాసరావు వైసీపీ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ అతి చేసేవారు. తొడలు కొట్టి మీసాలు తిప్పేవారు. చివరికి టీడీపీ ప్రభుత్వం గెలవగానే వర్ల రామయ్య వద్దకు వెళ్లి క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితిని పోలీసు అధికారుల సంఘానికి ఆయనే తీసుకు వచ్చారు.
జగన్ వ్యాఖ్యలపై మీడియా ముందుకు వచ్చిన జనకుల శ్రీనివాసరావు
పోలీసు అధికారుల సంక్షేమం కోసం… ఆ సంఘం ఏర్పడింది. వారిలో వారికి ఉన్న అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవడానికి.. ప్రభుత్వం తరపున రావాల్సిన పథకాలు ఉంటే.. చర్చించుకోవడానికి ఆ సంఘం ఉపయోగపడాలి. అంతే కానీ రాజకీయాల జోలికి రాకూడదు. రాజకీయ నేతలు పోలీసుల్ని తమ తమ పరిధి మేరకు కంట్రోల్ చేయాలని చూడటం సహజం. అందు కోసం మైండ్ గేమ్ ఆడతారు. రకరకాల ప్రకటనలు చేస్తారు. అందులో పోలీసుల్ని కించ పరిచేవి ఉంటాయి. కానీ వాటికి స్పందిస్తే.. రాజకీయం అవుతుంది.
పోలీసుల సిన్సియర్ డ్యూటీనే రాజకీయ నేతలకు కౌంటర్
పోలీసు అధికారులు తమ డ్యూటీని సిన్సియర్ గా చేయడమే ఇలాంటి రాజకీయ నేతలకు ఇచ్చే సమాధానం. దొంగలపై చర్యలు తీసుకుంటే.. దొంగలు పోలీసులపై ఆరోపణలు చేస్తారు. అందులో సందేహంలేదు. అందుకని వారికి కౌంటర్ ఇవ్వాల్సిన పని లేదు. కానీ తమ డ్యూటీ తాము చేసి ఆ దొంగల్ని చట్టం ముందు నిలబెడితే మాత్రం అది గొప్ప కౌంటర్ అవుతుంది. పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరించకూడదు. తప్పు చేయని వారిపై ఎలాంటి బలప్రయోగం చేయకూడదు. కానీ తప్పు చేసిన వారిని మాత్రం వదిలి పెట్టకూడదు. అలాంటి సిన్సియారిటీ చూపించినప్పుడే పోలీసుల విలువ పెరుగుతుంది.
వైసీపీ ప్రభుత్వ నాటి పోకడలు ఎందుకు ?
జనకుల శ్రీనివాసరావు పోలీసు అధికారుల సంఘానికి అధ్యక్షుడిగా కంటే ఏదైనా రాజకీయ పార్టీలో చేరి అదృష్టాన్ని పరీక్షించుకుంటే బాగుంటుందని చాలా మంది సలహాలిస్తున్నారు. ఆయనపై వైసీపీ హయాంలో ఉన్న పలు రకాల విచారణల్ని అడ్డం పెట్టుకుని ఆయనను బెదిరించి టీడీపీ నేతలకు వ్యతిరేకంగా ప్రకటనలు ఇప్పించేవారని ఎక్కువ మందికి తెలుసు. అయితే ఆ నాటి వైసీపీ ప్రభుత్వ పోకడలు ఇప్పుడు ఉండవు. ఆయన ఆవేశ పడాల్సిన పనిలేదని.. డ్యూటీ మాత్రం సిన్సియర్ గా చేస్తే చాలన్నా అభిప్రాయం సామాన్యుల నుంచి వినిపిస్తోంది.