తెలంగాణా శాసనసభలో బడ్జెట్ పై జరుగుతున్న చర్చలో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత కె.జానారెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుకి మధ్య ప్రాజెక్టులపై వాదోపవాదాలు జరిగాయి. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ “కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొన్నప్పుడు, పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించినా ఆ ఒప్పందంలోని ఒక్క ప్రాజెక్టుని కూడా ఎందుకు పూర్తి చేయలేకపోయాయి? కాంగ్రెస్ నేతలు తమ జేబులు నింపుకోవడానికే పనికిరాని దేవాదుల ప్రాజెక్టుని నిర్మించారు. ప్రాణహిత ప్రాజెక్టు కోసం 2007లోనే టెండర్లు పిలిచినా 2014 వరకు పనులే మొదలుపెట్టలేదు కానీ దాని పేరు చెప్పుకొని కాంగ్రెస్ పార్టీ నేతలు ఏకంగా రూ.1400 కోట్లు జేబులో వేసుకొన్నారు. పనులు జరుగకపోయినా మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట కోట్లాది రూపాయలు కాంట్రాక్టర్ల చేతుల్లో పోసి, పనిలోపనిగా కాంగ్రెస్ పార్టీ నేతలు తమ జేబులు కూడా నింపుకొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అన్ని పాపాలను మా ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మించి కడిగివేస్తుంది. వచ్చే ఎన్నికలలోగా రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీళ్ళు అందించాలనే గొప్ప సంకల్పంతో మా ప్రభుత్వం ముందుకు సాగుతోంది,” అని హరీష్ రావు చెప్పారు.
దానికి జానారెడ్డి కూడా చాలా దీటుగానే జవాబు చెప్పారు. “ఆనాడు మా ప్రభుత్వం మొదలుపెట్టిన అనేక ప్రాజెక్టులు దాదాపు పూర్తయ్యాయి కనుకనే నేడు మీరు వాటి ఫలాలు అనుభవించగలుగుతున్నారు. ఆనాడు నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పోరాదినందునే ఏ.ఎం.ఆర్. ప్రాజెక్టు వచ్చింది. దాని ద్వారా నల్గొండ జిల్లాలో అనేక వేల ఎకరాలు సాగావుతున్నాయి. మా ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన అనేక విద్యుత్ ప్రాజెక్టులు నేటికి నిర్మాణం పూర్తి చేసుకొని విద్యుత్ ఉత్పత్తి మొదలుపెట్టాయి కనుకనే నేడు విధ్యుత్ సంక్షోభం నుండి రాష్ట్రం బయటపడగలిగింది. రాష్ట్రం కోసం అన్నీ మేమే చేస్తున్నాము మరెవరూ ఏమీ చేయలేధన్నట్లు తెరాస నేతలు మాట్లాడటం అవివేకమనిపించుకొంటుంది,” అని అన్నారు.