మంత్రి పదవుల రేసులోకి జానారెడ్డి వచ్చారు. అయితే ఆయన కోసం కాదు. రంగారెడ్డి జిల్లా కోసం ఆయన లేఖ రాశారు. మంత్రి వర్గంలో రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ ఆయన లేఖ రాశారు. నల్లగొండ జిల్లాకు చెందిన జానారెడ్డి.. రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం కావాలని..హైకమాండ్ కు సిఫారసు చేయడం వెనుక అంతుబట్టని రాజకీయం ఉందని అనుకుంటున్నారు.
రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. ఇబ్రహీంపట్నం నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి మాత్రమే గెలిచారు. ఆయన మంత్రి పదవి కోసం సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. కానీ రెడ్డి సామాజికవర్గంలో ఎక్కువ మంది ఆశావహులు ఉండటంతో ఆయన పేరు పరిశీలనలోకి రావడం లేదు. జానారెడ్డి ఇప్పుడు పవర్ ఫుల్ గా కనిపిస్తూండటంతో ఆయనను మల్ రెడ్డి సంప్రదించినట్లుగా తెలుస్తోంది. ఆయన కోసం జానారెడ్డి లేఖ సాయం చేశారని భావిస్తున్నారు.
అదే సమయంలో మంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అవకాశాలను కూడా దెబ్బకొట్టినట్లుగా ఉంటుందన్న అబిప్రాయం వినిపిస్తోంది. జానారెడ్డి మాటలు అర్థం కానట్లుగానే ఆయన రాజకీయం కూడా అర్థం కాదు. కానీ ఆ రాజకీయానికి లోతెక్కువ. అందుకే ఆయన తన ఇద్దరు కుమారులను ఎంపీ, ఎమ్మెల్యేలను చేశారు. తాను కూడా చక్రం తిప్పుతున్నారు.