తెలంగాణా కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి ఈమధ్య తరచూ ముఖ్యమంత్రి కెసిఆర్ కి సవాళ్లు విసురుతున్నారు. తెలంగాణా ప్రభుత్వం మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులని వచ్చే ఎన్నికలలోగా పూర్తిచేసి, పంటలకి నీళ్ళు అందించినట్లయితే తను రాజకీయ సన్యాసం తీసుకోవడమే కాకుండా తెలంగాణా ప్రభుత్వం తరపున ప్రచారం చేస్తానని సవాలు విసిరారు. ఆ తరువాత, కెసిఆర్ హామీ ఇచ్చినట్లు ముస్లింలకి 12 శాతం రిజర్వేషన్లు ఇచ్చినా తను రాజకీయ సన్యాసం తీసుకొంటానని ప్రకటించారు. మళ్ళీ నిన్న మరో సవాలు విసిరారు. సాగర్ ఆయకట్టు క్రింద రెండో పంటకి తెలంగాణా ప్రభుత్వం నీళ్ళు అందించినా కూడా తను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్దంగా ఉన్నానని ప్రకటించారు.
ఆ విధంగా సవాలు విసరడం ద్వారా కెసిఆర్ ప్రజలకి మాయమాటలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, అవి ఆచరణ సాధ్యం కాని హామీలని వాటిని కెసిఆర్ ఎన్నటికీ అమలుచేయలేరని గట్టిగా చెప్పడం కోసమే, తన రాజకీయ జీవితాన్ని సైతం పణంగా పెట్టేందుకు సిద్దమని జానారెడ్డి ఆవిధంగా చెపుతున్నారని అర్ధమవుతూనే ఉంది. కానీ వాటి వెనుక మరో కారణం కూడా కనిపిస్తోంది.
తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవికి తామే అర్హులమని భావించేవారు కనీసం ఒక డజను మంది ఉన్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నమాటలని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవలసిఉంది. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తానే ముఖ్యమంత్రి అభ్యర్ధినని ప్రకటించుకొన్న జానారెడ్డి ఆ ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ కి ఇటువంటి సవాళ్ళు విసురుతున్నట్లు భావించవచ్చు. కేవలం తాను మాత్రమే ముఖ్యమంత్రి కెసిఆర్ ని గట్టిగా డ్డీకొనగలనని, తెరాస ధాటిని తట్టుకొని కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించగలనని నిరూపించేందుకే జానారెడ్డి ఈవిధంగా కెసిఆర్ కి సవాళ్ళు విసురుతున్నట్లుంది. వరుస ఓటముల కారణంగా తీవ్ర అప్రదిష్ట పాలైన రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టబోతే పార్టీలో నేతలే ఆయన నాయకత్వ లక్షణాల గురించి సందేహాలు వ్యక్తం చేశారు. అప్పుడు రాహుల్ గాంధీ తన నాయకత్వ లక్షణాలు నిరూపించుకొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించి అందరినీ మెప్పించాలని ప్రయత్నించడం అందరూ చూస్తూనే ఉన్నారు. బహుశః జానారెడ్డి కూడా అదేవిధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ కి ఇటువంటి సవాళ్ళు విసరడం ద్వారా ఆయనకి తెలంగాణాలో కేవలం తను మాత్రమే సాటి రాగలనని నిరూపించుకొనే ప్రయత్నం చేస్తున్నట్లున్నారు. కానీ ఆయన పదేపదే రాజకీయ సన్యాసం చేస్తానని విసురుతున్న సవాళ్ళు ప్రజలకి వేరేవిధంగా చేరుతున్నాయి.
తెరాస ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలని ఆయనే స్వయంగా చాలా పొగుడుతుంటారు. హరితహారం ప్రాజెక్టు మొదలుపెట్టినందుకు ఆయన ముఖ్యమంత్రి కెసిఆర్ ని చాలా మెచ్చుకొన్నారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తున్నప్పుడు మెచ్చుకోవడంలో తప్పు లేదు కానీ మళ్ళీ అంతలోనే ఈవిధంగా కెసిఆర్ కి సవాలు విసిరుతూ రాజకీయ సన్యాసం చేస్తానని సవాళ్ళు విసురుతుండటంతో ఆయన అయోమయంలో ఉన్నట్లనిపిస్తుంది.
తెరాస ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వలన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాలేదనే నిరాశా నిస్పృహలతోనే ఆయన రాజకీయ సన్యాసం గురించి ఆలోచిస్తున్నారేమోననే భావన కనిపిస్తోంది. తను ఒక ఉద్దేశ్యంతో కెసిఆర్ కి ఈవిధంగా సవాళ్ళు విసురుతుంటే, అవి ప్రజలకి మరొకలాగా చేరే ప్రమాదం ఉందని ఆయన గ్రహిస్తే మంచిది. ఏనాటికైనా ముఖ్యమంత్రి కావాలని కోరుకొంటున్న జానారెడ్డి అందుకు తగ్గట్లుగానే ఆత్మవిశ్వాసం వ్యక్తం అయ్యేవిధంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీపై తెరాస ప్రయోగిస్తున్న ఆకర్ష మంత్రాన్ని త్రిప్పికొట్టి చూపగలిగితే తెలంగాణాలో కెసిఆర్ కి ఆయనే సరిసమానం అనే భావన ప్రజలకి కూడా కలుగుతుంది కదా?