తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కంగారు చాలా ఎక్కువగా కనిపిస్తోంది. జరిగిన పరిణామాలకంటె జరగబోయే పరిణామాల గురించి వారిలో ఎక్కువ ఆందోళన చెలరేగుతున్నట్లుగా సమాచారం. పార్టీకి ప్రస్తుతం 15 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. వారిలో ఒకరు జారుకున్నారు. సంఖ్య 14 అయింది. ఇది కాస్తా మరింతగా ఎక్కడ తగ్గిపోతుందో అని కాంగ్రెస్లో కంగారు ఉంది.
అయితే పార్టీ ఇప్పుడు ఫిరాయింపుల మీద జోరుగా స్పందిస్తోంది. పార్టీ నాయకుడు జానారెడ్డి మాట్లాడుతూ.. సుప్రీం కోర్టులో దీని మీద కేసు వేస్తాం అంటూ హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఆయన తాజాగా ప్రధాని నరేంద్రమోడీకి ఫిర్యాదు చేస్తాం అని కూడా అంటున్నారు. పార్టీ ఫిరాయింపులను పూర్తిగా కట్టడి చేసేలాగా ఒక సమగ్రమైన కొత్త చట్టం తీసుకురావాల్సిందిగా ప్రధానిని కోరుతాం అని ఆయన అంటున్నారు. అవసరమైతే ఇందుకు తమ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కూడా సహకరిస్తుందని జానా అంటున్నారు.
అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని తమ రాష్ట్ర పార్టీ సమస్య మీద కదిలించడం అనేది జానాకు సాధ్యమేనా అనేది ప్రశ్న. ప్రతి పార్టీ కూడా అధికారంలోకి రాగానే ఇష్టారాజ్యంగా ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తుంటాయి. తెలుగురాష్ట్రాల్లో తమకు ప్రస్తుతం గతిలేకపోయినా.. ఇతర రాష్ట్రాలో ఇలాంటి పనులు కాంగ్రెస్కు కొత్త కాదు. మరి అలాంటప్పుడు.. పటిష్టమైన ఫిరాయింపు నిరోధక చట్టం ఉండడానికి కాంగ్రెస్ అధిష్ఠానం ప్రధాని మోడీ వద్దకు వెళ్లి విజ్ఞప్తి చేయడం సాధ్యమేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గురించి అధిష్ఠానంలో శ్రద్ధ పోయిందని, వారి కోరికలను ఏమాత్రం మన్నించే పరిస్థితి ప్రస్తుతం లేదని విశ్లేషిస్తున్నారు.