మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ షో నుండి తప్పుకున్న తర్వాత మరింత చురుగ్గా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉన్న సంగతి కూడా తెలిసిందే. ఇక తాజాగా తాను రెండు కొత్త కామెడీ షోలు ప్రారంభిస్తున్నట్లు నాగబాబు ప్రకటించారు. అయితే నాగబాబు యూట్యూబ్ లో చేస్తున్న హడావుడి మీద, కొత్తగా ప్రారంభించనున్న కామెడీ షో ల మీద జనసైనికులు నుండి మిశ్రమ స్పందన వస్తోంది. వివరాల్లోకి వెళితే..
రెండు కొత్త షో లు ప్లాన్ చేసిన నాగబాబు:
జబర్దస్త్ షో నుండి తప్పుకున్న తర్వాత జీ తెలుగు ఛానల్ లో అదిరింది షో లో కనిపించాడు నాగబాబు. యూట్యూబ్ వ్యూస్ పరంగా చూస్తే అదిరింది లో వచ్చే 1 లేదా 2 స్కిట్లు జబర్దస్త్ లో వచ్చే స్కిట్ లతో సమానంగా వ్యూయర్షిప్ తెచ్చుకుంటున్నప్పటికీ, టిఆర్పి రేటింగ్ లలో మాత్రం జబర్దస్త్ కి దరిదాపుల్లో కూడా అదిరింది షో కనిపించడంలేదు. అయితే అదిరింది షో ని మరింత జన రంజకంగా తీర్చడానికి నాగబాబు సరి కొత్త ప్రయత్నాలు చేస్తున్నారేమో అనుకుంటే, ఆ షో నుండి పక్కన పెట్టి మరో రెండు రెండు కొత్త కామెడీ షోలను ప్రారంభించనున్నట్టు ప్రకటించారు నాగబాబు.
అవి తన యూట్యూబ్ ఛానల్ లో ప్రసారమవుతాయని, నవ్వించగల టాలెంట్ ఉన్న వారు తనను సంప్రదించవచ్చని నాగబాబు ప్రకటించారు. అదేవిధంగా యూట్యూబ్ లో తన ఛానల్ కు మూడు లక్షలు పైగా ప్రేక్షకులు సబ్స్క్రయిబ్ చేసుకున్నారని కూడా నాగబాబు ప్రకటించారు.
ఈ కామెడీ షో లు పక్కనపెట్టి రాజకీయాలపై, సొంత మీడియా ఏర్పాటుపై దృష్టి సారించాలని అభిమానుల సూచన:
అయితే మెగా ఫ్యామిలీ తీసుకునే దాదాపు ప్రతి నిర్ణయాన్ని సమర్థించే మెగా అభిమానులు, జన సైనికుల లో సైతం నాగబాబు ప్రకటనపై మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది మాత్రం కొత్త టాలెంట్ ని పరిచయం చేయాలనే ప్రయత్నం మంచిదే అని అభినందిస్తూ ఉన్నప్పటికీ, మెజారిటీ అభిమానులు జనసైనికులు మాత్రం దీనిపై పెదవి విరుస్తున్నారు. జనసేన పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన ప్రతికూలత మీడియా మద్దతు లేకపోవడం. ఏదైనా సమస్య పై పవన్ కళ్యాణ్ తొలుత మాట్లాడినా, ప్రభుత్వాలను ఇరకాటం లో పెట్టేలా ప్రశ్నలు సంధించినా, ప్రధాన చానల్స్ చాలా వరకు దాన్ని కవర్ చేయకుండా, పవన్ కళ్యాణ్ లేవనెత్తిన సమస్యను కొద్ది గంటల తర్వాత తెలుగుదేశం పార్టీ కానీ మరొక పార్టీ కానీ లేవనెత్తిన తర్వాత దాన్ని కవర్ చేస్తూ, జనసేన అన్న పార్టీ ఉందన్న ఉనికి కూడా ప్రజలు మరిచిపోయేలా చేయడానికి శాయశక్తులా కృషి చేస్తున్నాయి అన్న అభిప్రాయం జనసైనికుల లో ఉంది. చాలా వరకు సంఘటనలు కూడా వారి అభిప్రాయం నిజమే అనిపించేలా జరుగుతున్నాయి. ఇటువంటి ప్రతికూలతలను అధిగమించడానికి సొంత మీడియా ఛానల్స్ , సొంత పత్రిక వంటివి ఏర్పాటు చేసుకోవడం, లేదంటే ఉన్న మీడియా ని సరైన రీతిలో వినియోగించుకునేలా వ్యూహాలు రచించడము చేయవలసిన సమయంలో, రాజకీయాలను పూర్తిగా పక్కనపెట్టి, జనసేన లో పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యుడు కూడా అయినటువంటి నాగబాబే కామెడీ షోస్ వంటివి చేసుకుంటూ ఉంటే మిగతా లీడర్ల పరిస్థితి ఏంటి అన్నది జనసైనికుల నుంచి వస్తున్న ప్రధాన ప్రశ్న. తమ పార్టీకి ఉన్న ప్రధాన ప్రతికూలతలు ఏమిటో తెలిసి కూడా వాటిని అధిగమించడానికి ప్రయత్నించకుండా ఇతర టైం పాస్ వ్యవహారాలతో కాలం సరి పుచ్చడం సబబు కాదని జనసైనికులు నాగబాబు సోషల్ మీడియాలో చేసిన ప్రకటనకు స్పందన గా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
మరి నాగబాబు తో సహా జనసేన నేతలు ఈ విషయంలో మేల్కొని సీరియస్ గా ఏవైనా నిర్ణయాలు తీసుకుంటారా లేక 2009లో 2019లో ఆరోపించినట్లుగా 2024లో కూడా మీడియా మద్దతు లేకపోవడం వల్లే మేం ఓడిపోయాం అని ఆరోపిస్తారా అన్నది వేచి చూడాలి.