రాంగోపాల్ వర్మ ‘వ్యూహం’ అనే సినిమాని తీస్తుంటే.. అందుకు జవాబుగా జనసేన అభిమానులు కొంతమంది ప్రతివ్యూహం అనే సినిమా తీసి, వర్మకు ధీటైన సమాధానం చెప్పాలని చూస్తున్నారు. ఈ మేరకు తెర వెనుక ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. వర్మ తీసే ఈ వ్యూహం, శపథం అనే రెండు సినిమాలూ జగన్ కు మద్దతుగా ఉంటాయని, టీడీపీ, జనసేనలపై విమర్శలు, విసుర్లు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వర్మ ఉద్దేశ్యమే అది. మరి… వర్మకు, వైకాపాకీ సమాధానం చెప్పాలి కదా? అందుకే… ఆ దిశగా జనసైనికులు ఆలోచిస్తున్నారు.
వర్మపై ఇది వరకు ‘పరాన్నజీవి’ అనే సినిమా తీసి, నేరుగా యూ ట్యూబ్లో విడుదల చేశాడు నూతన్ నాయుడు. ఇప్పుడు తనే.. వైకాపాని టార్గెట్ చేస్తూ, వర్మకి సమాధానంగా `ప్రతివ్యూహం` అనే సినిమాని రూపొందించే పనిలో ఉన్నాడని టాక్. జనసైనికులు కొంతమంది ఈ సినిమాకి సపోర్ట్ చేయబోతున్నారు. సరిగ్గా.. వర్మ `వ్యూహం` సినిమా రిలీజ్ చేసే రోజే.. `ప్రతివ్యూహం` కూడా రిలీజ్ చేయాలన్నది ఆలోచన. `వ్యూహం` జగన్ని ఎలివేట్ చేసేలా ఉంటే.. `ప్రతివ్యూహం`లో జగన్ చేసిన పాపాలూ, ఘోరాలూ చూపించాలని ఫిక్సయ్యారు. మొత్తానికి ఈ ఎన్నికలలో ప్రచార వ్యూహాలన్నీ వెండి తెరపై చూడ్డానికి ఓటర్లు రెడీగా ఉండాలన్న సంకేతాలు మాత్రం అందేస్తున్నాయి. రాను రాను ఇంకెన్ని చూడాలో?