తొందర పడి ఏదో ఒకటి చేయడం కన్నా.. ఏమీ చేయకుండా ఉండటమే మంచిదన్న పాలసీని.. కాపు రిజర్వేషన్ల అంశంలో పాటించాలని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఇటీవల నియమించిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ తొలి సమావేశాన్ని పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన మేథోమథనంలో కాపు రిజర్వేషన్ల అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ అంశంపై ఏదో ఓ ప్రకటన చేయడం వల్ల రెచ్చగొట్టినట్లు అవుతుందని.. అది బాధ్యతా రాహిత్యమేనని పవన్ కల్యాణ్ తేల్చారు. అందుకే ఈ అంశంపై పార్టీ పరమైన అభిప్రాయం… మేధావులతో చర్చలు జరపడమేనని జనసేన పొలిటికల్ అపైర్స్ కమిటీ తేల్చింది. రాబోయే రోజుల్లో న్యాయకోవిదులు, రాజ్యాంగ నిపుణులు, వివిధ వర్గాలు, మేధావులు, ప్రతినిధులతో కాపు రిజర్వేషన్లపై చర్చించి పార్టీ అభిప్రాయం వెల్లడిస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు.
నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కులాల మధ్య చిచ్చురేపే విధంగా వ్యవహరిస్తున్నరని… జగన్మోహన్ రెడ్డి.. ఏడాదికో మాట మారుస్తూ… గందరగోళం సృష్టిస్తున్నారని పవన్ కల్యాణ్ విమర్శించారు. రిజర్వేషన్ల అమలుకు ఆచరణాత్మక విధివిధానాలతో కూడిన నిర్ణయాలు అవసరమని పవన్ కల్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. విధానపరంగా తీసుకున్న నిర్ణయాల కారణంగా ప్రజల మధ్య అంతరాలు పెరిగే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అత్యంత కీలక అంశంగా ఉన్న కాపు రిజర్వేషన్ల పై … జనసేన పార్టీ… నేరుగా అభిప్రాయం చెప్పుకుండా… తప్పించుకునే ప్రయత్నం చేసిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కాపు సామాజికవర్గం మద్దతు జనసేనకు ఉంటుందని భావిస్తున్న సమయంలో ఆ వర్గానికి మద్దతుగా పవన్ కల్యాణ్ ప్రకటన చేయకపోవడం.. రాజకీయ వర్గాలను కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది.
నిజానికి కాపు రిజర్వేషన్లే కాదు.. తెలంగాణలోని ముస్లిం రిజర్వేషన్లు సహా.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న రిజర్వే,న్ల అంశానికి సంబంధించి… న్యాయ, రాజ్యాంగ నిపుణులు చాలా స్పష్టమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదనే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చూసినా… జాట్ల రిజర్వేషన్ వ్యవహారంలో సుప్రీంకోర్టు అబిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నా…కాపు రిజర్వేషన్లు సాధ్యం కావని నిపుణులు నేరుగానే చెబుతున్నారు. కానీ పవన్ కల్యాణ్ కూడా ఇతర రాజకీయ పార్టీల్లాగే ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. చర్చల పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.