కియా పరిశ్రమకు అదనంగా అరవై మూడు ఎకరాలు ఇస్తే ఆ సంస్థ ఏదో పెద్ద ప్లాంటే పెట్టబోతోందని అర్థం. ఆ సంస్థ అనుబంధ సంస్థలన్నింటినీ ఎప్పుడో పక్క రాష్ట్రాలకు తరలించేసింది. కొత్తగా పెట్టుబడులు పెట్టట్లేదు. అయితే ప్రభుత్వం ఏ చిన్న పరిశ్రమ వచ్చినా గొప్పగా ప్రకటించుకుంటోంది. కానీ ఇటీవల కియా సైంటిఫిక్ ప్రాసెసింగ్ అనే సంస్థకు అరవై మూడు ఎకరాలు ఇచ్చినట్లుగా ఎక్కడా చెప్పలేదు. కానీ నిర్ణయం తీసుకున్నారు. అంత పెద్ద మొత్తం భూములు ఇచ్చిన పరిశ్రమ గురించి ఎందుకు చెప్పలేదనే అంశం ఇప్పుడు జనసేన ప్రశ్నిస్తోంది.
అసలు కియా.. ఈ కియా సైంటిఫిక్ ప్రాసెసింగ్ ఒక్కటేనా అనేది జనసేన అనుమానం. ఒక వేళ ఒకటే అయితే ఘనంగా చెప్పుకునేవారు కదా ఎందుకు చెప్పుకోవడం లేదనేది అసలు డౌట్. నెట్ లో వెదికితే కియాకు అసలు ప్రత్యేకంగా కియా సైంటిఫిక్ ప్రాసెసింగ్ అనే సంస్థే లేదని చెబుతోంది. మరి ఈ సంస్థ ఎక్కడి నుంచి వచ్చింది.. ఎలా వచ్చింది.. ఏమని ప్రతిపాదించింది.. ఆ సంస్థకు వెంటనే భూములు ఇచ్చారు.. ఇస్తే ఇచ్చారు.. అసలు ఆ సంస్థ ఏ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటోంది.. ఎంత మందికి ఉద్యోగాలిస్తోంది లాంటి విషయాలను ఎందుకు గోప్యంగా ఉంచారనేది తేలాల్సి ఉంది. ఇవే అంశాలను నాదెండ్ల మనోహర్ ప్రశ్నిస్తున్నారు.
ఈ కియా భూకేటాయింపుల అంశం ముందు ముందు రాజకీయ ప్రకంపనలకు వేదికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసినా దానిలో స్కాం కనబడుతోంది కానీ..నిజాయితీ ప్రయత్నం కనిపించడం లేదు. ఇప్పటి వరకూ భూములు కేటాయింపు పొందిన కంపెనీలు ఏవీ ఇంత వరకూ కనీసం ప్లాంట్ల నిర్మాణం ప్రారంభించాయో లేదో కూడా స్పష్టత లేదు. ఎప్పుడో వచ్చిన కంపెనీల లెక్క చెబుతున్నారు కానీ కొత్తగా భూములు తీసుకున్న వారెవరూ ఎలాంటి ప్లాంట్లు పెట్లలేదు. చివరికి జగన్ కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్స్‌లో అత్యధిక వాటా ఉన్న ఫ్రాన్స్ కంపెనీ వికాట్ కూడా విస్తరణ చేస్తామని మూడేళ్ల కిందట ప్రకటించింది.. ఇంత వరకూ ఎలాంటి పెట్టుబడులు అదనంగా పెట్టలేదు.