జనసేనను త్వరలోనే జనంలోకి తీసుకొస్తామని ఆ మధ్య పవన్ కల్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే. ప్రజా స్పందన చూశాకనే వచ్చే ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీకి దిగాలనేది కూడా నిర్ణయిస్తామన్నారు. అయితే, ఏయే అంశాలతో జనసేన జనంలోకి వస్తుందనేది ఇన్నాళ్లూ ప్రశ్నగానే ఉంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ట్విట్టర్ అకౌంట్లో కొన్ని అంశాలపై పవన్ స్పందించిన తీరు ఆసక్తికరంగా ఉంది. ఒక సమస్యకు పరిష్కారం కావాలంటే లక్షమందికి అన్యాయం జరగాలంటే కుదురుతుందా పవన్ అన్నారు. ఒకవైపు స్పెషల్ స్టేటస్ ఇవ్వరూ, ఉద్యోగాలు క్రియేట్ చెయ్యరు, ఉన్నవి కూడా తీసేస్తారూ అంటే కడుపుమండి అది ఏ రూపం తీసుకుంటుందో అనే ఆవేదన వ్యక్తం చేశారు.
తాజాగా పెట్టిన ఈ ట్వీట్లలో ప్రత్యేక హోదా గురించి పవన్ కల్యాణ్ మరోసారి స్పష్టంగా స్పందించడం విశేషం! హోదా ఇవ్వరూ, ఉద్యోగాలు సృష్టించరూ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఈ ఆగ్రహం నేరుగా భాజపా సర్కారు పనితీరు మీదా, లేదా ముఖ్యంత్రి చంద్రబాబు ప్రయత్న లోపం మీదా అనే స్పష్టత లేదు. పోనీ, జనసేన తరఫున ప్రత్యేక హోదాపై కొత్తగా ఏదైనా కార్యక్రమం చేపట్టబోతున్నారా అనే వివరాలు కూడా చెప్పలేదు. నిజానికి, ప్రత్యేక హోదా అనేదే పూర్తిగా తెరమరుగు అయిపోయిన విషయంగానే ఇతర రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆ అంశానికి ప్రాధాన్యత ఉండే అవకాశం కూడా కనిపించడం లేదు. ప్రతిపక్ష పార్టీ వైకాపా కూడా దీన్ని వదిలేసింది. నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా ఎక్కడా ఇది ప్రస్థావనకు రాలేదు. ఇలాంటి నేపథ్యంలో మరోసారి ప్రత్యేక హోదాపై ఏదో ఒకటి చేస్తారనే సంకేతాలు జనసేన ఇచ్చినట్టు అవుతోంది.
ప్రస్తుతం జనసేన పార్టీ నిర్మాణ దశలో ఉందని పవన్ ఆ మధ్య చెప్పారు. అయితే, ప్రజల్లోకి వెళ్తానని కూడా అన్నారు. పాదయాత్ర లాంటింది ఉంటుందని ముందుగా అనుకున్నా, వేరే రూపంలో ఇతర మాధ్యమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యే కార్యక్రమాలు ఉంటాయనీ తరువాత పవన్ క్లారిటీ ఇచ్చేశారు. దాన్లో భాగంగానే ఈ ట్వీట్లు అనుకోవచ్చు. ప్రత్యేక హోదాకు సంబంధించిన ఏదైనా కార్యాచరణ ఉంటుందేమో అనే సంకేతాలు ఇప్పుడు మళ్లీ వ్యక్తమౌతున్నాయి. వాస్తవానికి, ప్రత్యేక హోదా మీదే గతంలో కొన్ని సభలు పెట్టారు పవన్. హోదాకు బదులుగా కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డులతో పోల్చారు. ఆ మధ్య విశాఖలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది. దానికి ట్వీట్ల ద్వారానే పవన్ మద్దతు ఇచ్చారు. ఆ తరువాత, వైజాగ్ రామకృష్ణా బీచ్ లో శాంతియుత నిరసన కార్యక్రమం చేపడతా అన్నారు. అది కార్యరూపం దాల్చలేదు. దాంతో జనసేన కూడా ఈ టాపిక్ ను పక్కన పెట్టేసిందని అనిపించింది. అయితే, మళ్లీ ఇప్పుడు ఈ అంశాన్ని వెలుగులోకి తెచ్చారు. మరి, తాజా కార్యాచరణ ఎలా ఉంటుందో, లేదా ఇది ఈ ఒక్క ట్వీట్ కే పరిమితమో వేచి చూడాలి.