తెలంగాణలో ఇంటర్మీడియట్ బోర్డు నిర్వాకం కారణంగా 18 మందికి పైగా పిల్లలు చనిపోయినా, వేలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు రోడ్లపైకి వచ్చినా, వైఎస్ఆర్సిపి మాత్రం ఈ సమస్యపై స్పందించకపోవడం మీద జనంలో విమర్శలు వస్తున్నాయి.
ప్రగతి భవన్ ముట్టడించిన జనసేన:
ముందు ఒకటి రెండు రోజుల పాటు చిన్న సమస్య అనుకున్న రాజకీయ పార్టీలు, తర్వాత సమస్య తీవ్రత అర్థమై గట్టిగా స్పందించాయి. పైగా టిఆర్ఎస్ ప్రభుత్వం సకాలంలో స్పందించక పోవడం వల్ల, మొదట్లో మీడియా కూడా గట్టిగా మాట్లాడక పోవడం వల్ల విద్యార్థుల లోనూ వారి తల్లిదండ్రుల్లో ఆందోళన మరింత ఎక్కువయింది. దీంతో రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాల్సి వచ్చింది. కాంగ్రెస్ బిజెపి పార్టీలతో పాటు పలు విద్యార్థి సంఘాలు ఈ సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీశాయి.చంద్రబాబు నాయుడు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం కనీసం పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి లో ఉందని ఎద్దేవా చేశారు.
జనసేన పార్టీ కూడా మొదట్లోనే ఈ సమస్యపై ఇంటర్మీడియట్ బోర్డు ఎదురుగా ప్రతిఘటించడం, కొందరు జనసైనికులు అరెస్టు కావడం జరిగింది. అలాగే ఈ సమస్యను సకాలంలో పరిష్కరించడం లో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ జనసైనికులు ఈ రోజు ప్రగతి భవన్ ముట్టడించారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
తెలంగాణలో కూడా సిఎం చేస్తాం అంటేనే జగన్ స్పందిస్తాడా?
కెసిఆర్ చాలా ఆలస్యంగా ఈ సమస్య మీద స్పందించడం వల్ల పిల్లల ప్రాణాలు పోయాయని కాంగ్రెస్ నేత విజయశాంతి ఆరోపించారు. ఇప్పుడు కూడా విద్యాశాఖ మంత్రి మీద కానీ, ఇంటర్మీడియట్ బోర్డు మీద కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. పిల్లలలోను , తల్లిదండ్రులు లోనూ ఇప్పటికీ పలు అనుమానాలు ఉన్నాయి. అయితే వైఎస్ఆర్ సిపి నేతలు కాని ఆ పార్టీ అధినేత జగన్ కానీ ఈ సమస్యపై స్పందించకపోవడం రాజకీయ పరిశీలకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సోషల్ మీడియాలో దీనిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తెలంగాణలో కూడా జగన్ ని సిఎం చేస్తాం అని అంటే తప్ప జగన్ ఈ సమస్యలపై పోరాడడేమో అంటూ వారు విమర్శలు చేస్తున్నారు. 2024లో తెలంగాణలో కూడా పోటీ చేస్తానంటున్న జగన్ ఈ సమస్యపై కనీస స్పందన కూడా తెలియ చేయకపోవడం ఏంటని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పైగా విజయ్ సాయి రెడ్డి లాంటి వారు ఈ సమస్య పూర్తిగా తెలంగాణకు సంబంధించింది కాబట్టి దీనిపై స్పందించడానికి ఏమీ లేదు అన్నట్టు మాట్లాడడం కూడా కడుపు మండిన తెలంగాణ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకి పుండు మీద కారం చల్లినట్లు చేసింది.
తెలంగాణ వ్యవస్థల సహాయం కావాలి కానీ తెలంగాణ సమస్యలు అక్కర్లేదా?
షర్మిలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు వచ్చినప్పుడు వాటిని దర్యాప్తు చేయడానికి తెలంగాణ పోలీసులు కావాలి, విశాఖపట్నంలో తనపై దాడి జరిగినప్పుడు గాయాన్ని పరిశీలించడానికి తెలంగాణ డాక్టర్లు కావాలి, ఆ కేసును దర్యాప్తు చేయడానికి తెలంగాణ పోలీసులు కావాలి, తన మీద తన పార్టీ మీద చిన్న దాడి జరిగిన ఈ చిన్న ఇబ్బంది అయినా తెలంగాణ వ్యవస్థల సహకారం ఆయనకు కావాలి, కానీ తెలంగాణలో విద్యార్థులు చనిపోతే మాత్రం ఆయన నోరుమెదపడా అంటూ జగన్ వ్యవహార శైలి పట్ల తెలంగాణ విద్యార్థులు వాపోతున్నారు.
మొత్తం మీద:
మొత్తంమీద జగన్ ఈ సమస్యపై ఏ మాత్రం స్పందించకపోవడం తెలంగాణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. శ్రీలంకలో దాడులు జరిగితే నిమిషాల వ్యవధిలో స్పందించిన జగన్, తెలంగాణ పిల్లల ప్రాణాలు పోతే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విమర్శలకు దారితీస్తోంది. ఎన్నికల ప్రచారంలో కేసిఆర్ తో జగన్ కుమ్మక్కయ్యారు అంటూ వచ్చిన రాజకీయ ఆరోపణలన్ని నిజమేనేమో అన్న అనుమానాలను కలిగించేలా గా జగన్ వ్యవహారశైలి సాగడం గమనార్హం.