జనసేన పార్టీ 12 వ ఆవిర్భావ దినోత్సవానికి జయకేతనం అని పేరు పెట్టారు. పిఠాపురం జాతీయ రహదారి ఆనుకుని ఉన్న చిత్రాడ ఎస్బీ వెంచర్స్‌లో నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరానున్నారు. లక్షల మంది హాజరయ్యే అవకాశాలుఉండటంతో దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు.
పార్కింగ్ కోసం ఐదు ప్రత్యేక ప్రాంతాలు ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితులు వస్తే ఎదుర్కోవడానికి 14 అంబులెన్స్‌లు, 7 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. కార్యక్రమంలో పాల్గొనే కార్యకర్తలకు భోజన వసతి ఏర్పాటు చేస్తున్నారు. ఎండల తీవ్రత దృశ్య పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భోజనంలో కొన్ని రకాల పండ్లను ఆహార పదార్థాలను కూడా జోడించాల్సిందిగా సూచించారు.
పార్టీ ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి విజయకేతనం సభ వేదికగా పార్టీ అధినేత పవన్ చేయబోయే ప్రసంగంపై అంతా ఆసక్తి నెలకొంది. సభా వేదిక వద్దకు పవన్ సాయంత్రం 4గంటలకు చేరుకుంటారని, అనంతరం సభాప్రాంగణం వద్దనే ఏర్పాటు చేసిన మీటింగ్ హాలులో పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, నియోజకవర్గ ఇంచార్జ్‌లతో సమావేశమవుతారు. అనంతరం జరగబోయే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.