పంచాయతీ ఎన్నికల విషయంలో కలసి పోటీ చేస్తామని బీజేపీ -జనసేన పార్టీలు ప్రకటించాయి. సోము వీర్రాజుతో ప్రత్యేకంగా నాదెండ్ల మనోహర్ భేటీ అయి దీనిపై చర్చించారు. అయితే మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత బీజేపీ, జనసేన మద్దతు దారుల పేరుతో ఎవరూ పెద్దగా హడావుడి చేస్తున్న పరిస్థితి కనిపించడం లేదు. ఎక్కడా ఆ పార్టీల ఉనికి కనిపించడం లేదు. అన్ని పంచాయతీ స్థానాలకు అభ్యర్థులను నిలుపుతామని చెబుతున్నారు కానీ.. అసలు రంగంలోకి వచ్చేసరికి పెద్దగాకార్యాచరణ కనిపించడం లేదు.
రాజకీయపార్టీకి గ్రామస్థాయిలో పార్టీ నిర్మాణం చాలా ముఖ్యం. గ్రామాల్లో పార్టీ బలంగా ఉన్నట్లే… పునాదులు బలంగా ఉన్నట్లే. పవన్ కల్యాణ్‌కు గ్రామాల్లోనూ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నప్పటికీ.. దాన్ని రాజకీయ శక్తిగా మార్చుకునే ప్రయత్నం ఆరేడేళ్ల కాలంలోచేయలేకపోయారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వచ్చినా చేయలేకపోతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు… పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని పవన్ కల్యాణ్ చాలెంజ్ చేశారు. ఇప్పుడు ఆయన కనీసం తమ పార్టీ మద్దతుదారులు ఎన్ని గ్రామాల్లో నామినేషన్లు వేస్తున్నారో పరిశీలిస్తున్నదాఖలాలు కూడా లేవంటున్నారు.
ఇక ఎక్కడ ప్రెస్‌మీట్ పెట్టినా… రికార్డెడ్‌గా రిపీటెడ్గాసోము వీర్రాజు చెప్పే మాట…ప్రజలందరూ తమను అధికారంలోకి రావాలని కోరుతున్నారని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమదే విజయం అని. ఇలాంటిసందర్భంలో ఆయన ఎంత దూకుడుగా ఉండాలో… పొరుగున ఉన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చాలా సార్లు నిరూపించారు. కానీ సోము వీర్రాజు సైలెంటయిపోయారు. జిల్లా, మండల స్థాయి నాయకత్వానికి దిశానిర్దేశం చేసే వారు కరవయ్యారు. టీడీపీ నుంచి వచ్చి చేరిన కొంత మంది వ్యక్తిగతబలమున్ననేతలు .. వారికి పట్టున్న గ్రామాల్లో బీజేపీని బలపరచడం మినహా చేసేదేమీ ఉండదని అంటున్నారు.
రెండు పార్టీల మధ్య సమన్వయం మాటల్లోనే కనబడుతోంది. కనీస మాత్రం పంచాయతీ ఎన్నికల్లో ప్రభావం చూపకపోతే.. వారివన్నీ మాటలేనని..చేతల్లో ఉండదన్న విమర్శలు వస్తాయి. తిరుపతి ఉపఎన్నికలపైనా ప్రభావం చూపిస్తాయి. అందుకే.. కనీసం రెండో విడత నుంచైనా బీజేపీ, జనసేన సీరియస్‌గా తీసుకోవాలని ఆయా పార్టీల కార్యకర్తలు కోరుకుంటున్నారు.