అమరావతిని రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్‌తో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు ఉమ్మడి పోరాట కార్యాచరణను ఖరారు చేసుకున్నాయి. ఫిబ్రవరి రెండో తేదీన తాడేపల్లి నుంచి విజయవాడ వరకు భారీ కవాతును నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. ఈ కవాతును విజయవంతం చేయడం.. పొత్తు సమన్వయంగా ఉండేలా చేసుకునేందుకు ఓ కమిటీని నియమించుకోనున్నారు. ఇరవై ఎనిమిదో తేదీన ఈ సమన్వయ కమిటీ భేటీ విజయవాడలో జరగనుంది. గురువారం.. బీజేపీ, జనసేన నేతలు.. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలుస్తారు. తమ పోరాట కార్యాచరణను వివరిస్తారు.
ఇకపై అన్ని కార్యక్రమాలు జనసేన- బీజేపీ కలిసే చేస్తాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ప్రకటించారు. రాజధాని విషయంలో రైతులకు అండగా ఉండటానికి.. బీజేపీ- జనసేన కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాయని నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని ప్రకటించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడికి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరిస్తామన్నారు. ముందుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి గంట సేపు చర్చలు జరిపిన తర్వాత బీజేపీ, జనసేన నేతలు ఎంపీ జీవీఎల్ ఇంట్లో సమావేశమయ్యారు. తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రెస్‌మీట్‌ను చాలా ముక్తసరిగా.. తాము చెప్పాలనుకున్నది చెప్పి.. ముగించేశారు.
ఆ సమయంలో.. బీజేపీతో విలీనం గురించి కొంత మంది మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అసలు అలాంటి కాన్సెప్టే లేదని పవన్ కల్యాణ్ తోసిపుచ్చారు. మొత్తానికి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీ.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రంగంలోకి దిగితే.. వారి అభీష్టానికి వ్యతిరేకంగా కేంద్రం వ్యవహరించలేదు. అలా వ్యవహరిస్తే.. డబుల్ గేమ్ ఆడుతున్నారనే విమర్శలు వస్తాయి. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని.. బీజేపీ, జనసేన భావిస్తున్నాయి.