పేదలకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన సెంట్ స్థలంలో నిర్మాణాల విషయంలో జరుగుతున్న భారీ స్కామ్‌పై జనసేన దృష్టి పెట్టింది. భూమి కొనుగోలు, మౌలిక వసతులు పేరిట వేల కోట్లు అవినీతి చేశారని కానీ పేదలకు మాత్రం ఇంకా ఇళ్లివ్వలేదన్నారు. పేదవాడికి జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో 12, 13, 14 తేదీల్లో ‘జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు’ పేరుతో డిజిటల్ క్యాంపైన్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తీసిన ఫోటోలు, వీడియోలను #Jagananna Mosam హ్యాష్ ట్యాగ్ ద్వారా సోషల్ మీడియాలో పోస్టు చేసి ప్రభుత్వ తీరును ఎండగట్టనున్నారు.
పవన్ కళ్యాణ్ కూడ రాష్ట్రంలో ఒక చోట అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగనన్న కాలనీలను పరిశీలించాలని నిర్ణయించారు. పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 28 లక్షల 30వేల మందికి ఇళ్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి హామీ ఇచ్చారు. అందులో భాగంగా తొలి విడతలో 18,63,552 గృహాలు 2022 జూన్ నాటికి నిర్మించి పేదలకు అందిస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ ఒక్క ఇల్లు కూడా పేదలకు ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ ఈ పేరుతో .. రాప్తాడు ఎమ్మెల్యే కంపెనీకి వేల కోట్లు ఇచ్చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.
జగనన్న కాలనీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 68,677 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందు కోసం రూ.10 నుంచి రూ.20 లక్షలు విలువ చేసే ఎకరా భూమిని రూ. 70 లక్షలు నుంచి కోటి రూపాయలు పెట్టి కొనుగోలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. సుమారు 23,500 కోట్లు వెచ్చించి ఈ భూములు కొన్నారు. ఇందులో వందల కోట్లు చేతులు మారాయని జనసేన ఆరోపిస్తోంది. జగనన్న కాలనీల్లో తాగునీరు, రోడ్లు వంటి కనీసం మౌలిక సదుపాయాలు ఇప్పటి వరకూ లేవు. గతంలో రహదారుల దుస్థితిపై గుడ్ మార్నింగ్ సీఎం సార్ హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ఏ విధంగా ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ చేశారు. అదే తరహాలో ఈ క్యాంపైన్ చేపడుతున్నారు.