ఆయనో డాక్టర్. ఓ మరుమూల ప్రాంతంలో.. మల్టి స్పెషాలిటీ ఆస్పత్రి పెట్టి వైద్య సేవలందిస్తున్నారు. సేవాగుణం మెండుగా ఉంది కాబట్టి… జనసేనలోనూ పని చేస్తున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నాయకుడిగా.. అనేక కార్యక్రమాలు చేపట్టారు. పవన్ ను కలిసి.. టిక్కెట్ కోసం ఓ దరఖాస్తు కూడా ఇచ్చేశారు. .. ఇది ఆ “ఫ్రంట్ సైడ్” కనిపించే మ్యాటర్..! ..
మరి తెర వెనుక ఉండేదేమిటి..? … డాక్టర్ వెంకటరమణ.. మనుషుల ప్రాణాల్ని కాపాడరు..తీస్తారు. అంటే మర్డర్ చేస్తారన్నమాట.. చేస్తారు కాదు.. చేశారు కూడా. పరిచయం అయిన వివాహితతో లైంగిక బంధం పెట్టుకుని… దానికి ఆమె భర్త అడ్డుగా ఉన్నాడని చెప్పి… ఆమె సాయంతోనే… ప్లాన్డ్ గా చంపించేశారు. చివరికి దొరికిపోయారు. కటకటాల వెనక్కి వెళ్లారు.
ప్రకాశం జిల్లా కంభంలో డాక్టర్ బాల వెంకటరమణ అనే డాక్టర్ ఆస్పత్రి నిర్వహిస్తున్నాడు. ఆస్పత్రి వెనుకాల జగన్మోహన్ రెడ్డి అలియాస్ జగన్ అనే వ్యక్తి తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. అక్కడ జరిగిన పరిచయం కారణంగా.. జగన్ భార్యతో వెంకటరమణ వివాహేతర బంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసి.. జగన్మోహన్ రెడ్డి భార్యను హెచ్చరించారు. భర్తకు తెలిసిపోయిందని.. ఆ మహిళామణి ఈ జనసేన నేతతో కలిసి.. భర్త హత్యకు ప్లాన్ చేసింది. ఆ జనసేన నేత.. తన డాక్టరీ అనుభవంతో మత్తు మందు ఇచ్చి.. శ్రీశైలం వైపు అడవుల్లోకి తీసుకెళ్లి.. జగన్మోహన్ రెడ్డిని పైకి పంపించేశారు. హత్య చేసిన తర్వాత నేరుగా… జగన్మోహన్ రెడ్డి ఇంటికే వచ్చి… ఆయన భార్యతో గడిపి వెళ్లారు. చాలా ప్లాన్డ్ గా చేసినప్పటికీ.. ఓ చోట సీసీ కెమెరాల్లో… జనసేన నేత వెంకటరమణ .. జగన్‌ను తీసుకెళ్లడం రికార్డయింది. దాంతో పోలీసులు డొంక కదిలించారు.
జనసేన పేరుతో… గిద్దలూరులో.. డాక్టర్ వెంకటరమణ చాలా హడావుడి చేసేవారు. తానే అభ్యర్థి అన్నంతగా చెలరేగిపోయేవారు. ఇతర నేతలు ఉన్నప్పటికీ.. పవన్ కల్యాణ్‌తో తనకు సాన్నిహిత్యం ఉందని చెప్పుకుంటూ.. కొన్ని ఫోటోలతో ..భారీగా ఫ్లెక్సీలు వేయించారు. ఇప్పుడీ ఘటనతో… గిద్దలూరులో జనసేనకు గట్టి దెబ్బ తగిలినట్లయింది. గతంలోనూ.. అనేక సార్లు జనసేన నేతలుగా చెలామణి అవుతూ… అక్రమాలకు పాల్పడిన కేసులు వెలుగు చూశాయి. జనసేనాధినేత ఇలాంటి వాళ్లను పార్టీలోనే ఉంచితే ఇబ్బంది తప్పదేమో..?