ఆంధ్రప్రదేశ్ లో తాము పొత్తులు పెట్టుకుంటే కమ్యూనిస్టులతో మాత్రమే పెట్టుకుంటామని… జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటన.. ఆ పార్టీలకు చెందిన ఏపీ కార్యదర్శులు రామకృష్ణ, మధులకు కొత్త ఉత్సాహం తెచ్చి పెట్టింది. వచ్చే ఎన్నికల్లో ఎవరితో కలసి పోటీ చేయాలా అని టెన్షన్ పడుతున్న సమయంలో… పవన్ ప్రకటన వారిని సంతోషపరిచింది. వెంటనే వారు పవన్ కల్యాణ్ వద్ద వాలిపోయారు. ఒకటో తేదీ నుంచి పవన్ కల్యాణ్ విజయవాడ ఆఫీసులోనే ఎక్కువగా ఉంటున్నారు. జిల్లాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. దీంతో.. సీపీఐ రామకృష్ణ, సీపీఐ మధు పవన్ కల్యాణ్ తో .. జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. వారు ఓ జాబితాను తమతో పాటు తీసుకొచ్చారు. పొత్తుల్లో భాగంగా.. తాము కోరుకునే సీట్ల జాబితాను తీసుకొచ్చి.. రెండు పార్టీల నేతలు విడివిడిగా జాబితాలు పవన్ కల్యాణ్ కు అందించారు.
తమకు పట్టు ఉన్న నియోజకవర్గాల జాబితాను… పవన్ కల్యాణ్ కు అందించారు. చెరో 30 స్థానాల వరకూ.. పోటీ చేయాలన్న ఉద్దేశంలో ఉన్నట్లు… కమ్యూనిస్టు పార్టీలకు చెందిన కొంత మంది నేతలు చెబుతున్నారు. తమలకు నిబద్ధత కలిగిన ఓటర్లు ఉన్నారని.. తమ ఓట్లన్నీ కచ్చితంగా బదిలీ అవుతాయని వారు చెబుతున్నట్లు తెలుస్తోంది. పొత్తు ఉందని పవన్ ప్రకటించారు కానీ… సీట్ల సర్దుబాటు గురించి… కానీ.. ఇతర విషయాల్లో కానీ.. ఎలాంటి పిలుపులు రాకపోవడంతో.. కమ్యూనిస్టు నేతలే చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది.
నిజానికి పవన్ కల్యాణ్ జిల్లాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. ఆయన పొత్తులపై సీరియస్ గా దృష్టి పెట్టలేదని… ఆయన పార్టీకి చెందిన వారు చెబుతున్నారు. కమ్యూనిస్టు పార్టీలు సీట్ల సర్దుబాటు జాబితాలతో వచ్చేయడంతో.. పవన్.. నాదెండ్ల మనోహర్ కు చర్చల బాధ్యత అప్పగించినట్లు తెలుస్తోంది. ఇప్పుడే మాట్లాడుకోవడం తొందర అవుతుందని.. సంక్రాంతి పండుగ తర్వాత మాట్లాడుకుందామని.. కమ్యూనిస్టు నేతలిద్దరూ నాదెండ్ల చెప్పి పంపించినట్లు తెలుస్తోంది. మొత్తానికి కమ్యూనిస్టు పార్టీల నేతలు.. పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనతో… పొత్తుల నుంచి సీట్ల సర్దుబాటు వరకూ వచ్చేశారు.