జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తుల విషయంలో క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఖాయంగా పెట్టుకుంటున్నామని ప్రకటించారు. సీఎం పదవి విషయంలో జరుగుతున్న ప్రచారానికి కూడా తెర దించే ప్రయత్నం చేశారు. బీజేపీనో.. టీడీపీనో తాను సీఎం పదవిని అడగబోనని ప్రకటించారు. షరతులు పెట్టి ముఖ్యమంత్రి స్థానాన్ని పొందలేమని స్పష్టం చేశారు. ప్రజలు కావాలని కోరుకుంటే సీఎం అవుతానన్నారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీకి 30 స్థానాలు ఇచ్చి ఉంటే సీఎం రేసులో ఉండేవాడిన్నారు. మన బలం అన్నది చూపి పదవి తీసుకోవాలన్నారు.
జనసేనకు పట్టు ఉన్న ప్రాంతాలలో 30శాతం ఓటింగ్ ఉందన్నరు. తమకు బలం ఉన్న మేరకే సీట్లు అడుగుతామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. జనసేనకు పట్టు ఉన్న ప్రాంతాల్లో ఖచ్చితంగా పోటీ చేస్తామన్నారు. పొత్తులకు సీఎం అభ్యర్థి ప్రామాణికం కాదని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. పొత్తుల విషయంలో తన స్టాండ్ మారలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా పొత్తులతోనే బలపడ్డాయని గుర్తు చేశారు. ముందస్తు ఎన్నికలు అంటున్నారని అందుకే జూన్ మూడో తేదీ నుంచి తాను ఏపీలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా పవన్ ప్రకటించారు.
పొత్తులకు ఒప్పుకోని వారు ఎవరైనా ఉంటే వారిని ఒప్పిస్తానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇదే విషయం పవన్ కల్యాణ్ ఢిల్లీలో కూడా మాట్లాడానని అంటున్నారు. అంటే బీజేపీ కూడా కలిసి రావాలని ఢిల్లీలో పవన్ చర్చలు జరిపినట్లుగా భావిస్తున్నరు. ఒక వేళ బీజేపీ రాకపోతే.. టీడీపీతో కలిసి వెళ్లేందుకు పవన్ సిద్ధమయ్యారని తాజా వ్యాఖ్యలతో ఎక్కువ మంది ఓ అభిప్రాయానికి వస్తున్నారు. సీఎం పదవి విషయంలో తమ క్యాడర్ చేస్తున్న వ్యాఖ్యలతో పొత్తు అంశం ముందుకు సాగకుండా అడ్డం పడకుండా..ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించారని అంటున్నారు. పవన్ వ్యాఖ్యలతో మెల్లగా టీడీపీ, జనసేన పొత్తులపై క్లారిటీ వస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.