జనసేన అధినేత పవన్ కల్యాణ్ నెలాఖరు వరకు ఏపీ సర్కార్కు డెడ్లైన్ పెట్టారు. ఆ రోపు రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం బకాయిలన్నీ చెల్లించకపోతే.. ఇక ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. గతంలోనూ ఇలా బకాయిలు చెల్లించకపోతే.. తాను కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష చేయాల్సి వచ్చిందిని అప్పటికీ కానీ బకాయిలు ఇవ్వలేదని.. ఇప్పుడు కూడా… అదే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు. అసలు రైతుల వద్ద నుంచి ఎంత మొత్తంలో ధాన్యం సేకరించారు.. ఎంత మొత్తం బకాయిలున్నాయో వివరాలను ఎందుకు దాచి పెడుతున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. నిజానికి ఈ వివరాలన్నీ పారదర్శకమే. వ్యవసాయ శాఖ వెబ్సైట్లో ఉండాలి. కానీ ప్రభుత్వం అనూహ్యంగా తొలగించింది.
ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించి.. ప్రభుత్వం తప్పు చేస్తోందన్నారు. ఒక్క పశ్చిమగోదావరి జిల్లా రైతులకు రూ. 1800 కోట్ల బకాయిలు ఉన్నారని గుర్తు చేశారు . ఆరు గాలం శ్రమించి పండించిన పంటను తీసుకుని డబ్బులు ఇవ్వకపోతే రైతులకు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. అలాగే మొక్కజొన్న పంటను వైసీపీ నేతల వద్దే కొనుగోలు చేస్తున్నారని.. రైతులకు పార్టీల రంగులు పూయడం ఏమిటని.. పవన్ ఫైరయ్యారు. నిరుద్యోగులకు అండగా… యువతతో కలిసి ఉద్యమాలు చేస్తున్న జనసేన.. తాజాగా… పంటల బకాయిలపై దృష్టి పెట్టింది.
ఇటీవల కొడాలి నాని ప్రెస్మీట్ పెట్టి.. నెలాఖరు లోపు.. అందరికీ ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా చెల్లింపులు చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు… పవన్ కల్యాణ్ కూడా ప్రభుత్వానికి నెలాఖరు వరకే గడువు పెట్టారు. ఆ లోపు ప్రభుత్వం మాట నిలబెట్టుకుని నిధులు చెల్లించకపోతే… పవన్ కల్యాణ్ ప్రత్యక్ష దీక్షలకు దిగే అవకాశం ఉంది. గతంలో మాదిరి రైతు సౌభాగ్య దీక్ష -2 చేయవచ్చని జనసేన వర్గాలు చెబుతున్నాయి.