జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ నేతలతో చర్చించేందుకు జిల్లాల పర్యటనలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఢిల్లీకి వెళ్లే ముందే ఆయన ఉత్తరాధ్రతో పాటు ఉభయగోదావరి జిల్లాల నేతలతో మాట్లాడాలనుంటున్నారు. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం విశాఖ చేరుకున్న ఆయన.. ఉత్తరాంధ్ర నేతలతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. అందరికీ ఒకేట మాట చెబుతున్నారు. పొత్తుల్లో భాగంగా పోటీ చేయని చోట్ల నేతలు నిరాశ పడాల్సిన పని లేదు.. ఎన్నికల తర్వాత అనేక పదవులు ఉంటాయని వాటిలో ప్రాధాన్యత ఇప్పిస్తానని చెబుతున్నారు.
పొత్తుల ఖరారు ప్రకటన.. సీట్ల షేరింగ్ పై ప్రకటన చేసేందుకు బీజేపీ అగ్రనేతలతో సమావేశం అయ్యేందుకు పవన్ రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ లోపే పార్టీ నేతలకు పరిస్థితి చెప్పి.. రెడీ చేసి వెళ్తున్నారు. టిక్కెట్ రాని వాళ్లకు డిజప్పాయింట్ అయి వెళ్లినా ఆపే పరిస్థితి ఉండదని.. సంకేతాలు ఇస్తున్నారు. పార్టీని నమ్మకున్న వారికి మాత్రమే తర్వాత అయినా మేలు చేస్తామన్న సంకేతాలు పంపుతున్నారు. 2019 తర్వాత పార్టీ బలంగా నిలబడేందుకు సహకరించిన అందరికీ అండగా ఉంటానని స్పష్టం చేశారు.
పొత్తలు, కూటమి ప్రధానంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినదని పవన్ చెబుతున్నారు. వ్యక్తిగతంగా తన ప్రయోజనాల కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం.. పార్టీ పక్షాన ఎన్నికలు నిర్వహణ కోసం తన కష్టార్జితం పది కోట్ల రూపాయలు నిధిగా ఇవ్వనున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు.