జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవిర్భావసభను భారీగా ప్లాన్ చేస్తున్నారు . టీడీపీ హయాంలో ఆయన పార్టీ ఆవిర్భావసభను ఎన్నికల ఏడాదిలో ఘనంగా నిర్వహించి తెలుగుదేశం పార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. శేఖర్ రెడ్డి లాంటి వాళ్లు లోకేష్ బినామీలని ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు. తాను గెలవలేకపోవచ్చు కానీ టీడీపీని ఓడించగలనని ప్రకటించారు. అప్పట్నుంచి ఆయన పోరాటం ఎన్నికలయ్యే వరకూ సాగింది. ఫ లితాలెలా వచ్చాయన్న విషయం పక్కన బెడితే.. ఈ సారి వైసీపీ ప్రభుత్వంపై ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే సమరం ప్రారంభించాలని నిర్ణయించారు.
ఈ ఏడాది ఆవిర్భావసభను మంగళగిరిలో అత్యంత భారీగా నిర్వహించాలని నిర్ణయించారు కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిపోవడం ఇక ఆంక్షల్లావేంటిమీ ఉండే అవకాశం లేకపోవడంతో మంగళగిరి సమీపంలోని కాజలో పెద్ద ఎత్తున సభ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు . ఇప్పటికే స్థలాన్ని ఖరారు చేశారు. మార్చి పధ్నాలుగో తేదీన జనసేన ఆవిర్భావ దినోత్సవం. మరో నెల రోజుల సమయం ఉంది. ఈ లోపు ఆ సభ నుంచి జనసేన రోజువారీ వ్యవహారాల్లో అత్యంత కీలకంగా ఉంటుందని తేల్చే అవకాశం ఉంది.
పవన్ కల్యాణ్ కూడా అప్పట్నుంచి ఎక్కువగా ప్రజల్లో ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా మరో రెండేళ్లకు పూర్తి స్థాయిలో ఎన్నికలు వస్తాయి. ఇప్పటికే ఏపీలో ఎన్నికల వాతావరణం ప్రారంభమయింది. ఇప్పుడు జనసేనాని కూడా రంగంలోకి దిగితే ఏపీలో పరిస్థితులు మారిపోతాయి. రాజకీయంగా హైపర్ యాక్టివ్ పరిస్థితి వచ్చేస్తుంది.