ఓట్లు చీలిపోకుండా చూస్తామని ఏకవాక్య తీర్మానం చేస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎందుకు అంత భయపడిపోతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. మేమంటే ఎందుకంత భయమన్నారు. మంగళగిరిలో జనసేన విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. వైసీపీ నేతలు రాష్ట్రాన్ని తమ అరాచకాలతో శ్రీలంక చేస్తున్నారన్నారు. అందుకే ఓట్లు చీలనివ్వబోమన్నారు. తానేంటో జనసైనికులకు తెలుసని.. తాము ఎవరి పల్లకీని మోయడానికి లేమన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలవదని.. వారు చేసిన అరాచకాలకు ఓట్లు అడిగే అర్హత కూడా లేదన్నారు. ఐఏఎస్లు మోకాళ్లపై కూర్చుంటే పరిపాలన సరిగా లేదని అర్థం అన్నారు.
రైతు ఆత్మహత్యలకు కారణం వైసీపీ నేతలేనని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వివిధ జిల్లాల్లో కౌలు రైతులు పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకుంటున్నారని..కష్టాల్లో ఉన్న వారిని ఎలా ఆదుకోవాలో అనేదే తాను ఆలోచిస్తాన్నారు. కులం లేని రైతుకు అండగా ఉండాలన్నారు. మనసు ఉండి సాయం కోసం కదిలించగలిగితే అవే డబ్బులు వస్తాయన్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసేందుకు ఉద్యమం చేస్తామన్నారు. మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి అధికారంలోకివచ్చి.. రేట్లు పెంచితే.. తాగరని తప్పుడు లాజిక్ చెప్పారన్నారు. కానీ కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారన్నారు. 2024కు మేము వస్తామని కానీ అప్పటి వరకూ మీ బిడ్డలు ఉండాలి కదా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి ఏకంగా రూ.ఐదు కోట్ల విరాళం ప్రకటించారు. పార్టీ నడపడం అంటే చిన్న విషయం కాదని.. ఎంతో ఖర్చుతో కూడుకున్నదని.. పార్టీని నడిపేందుకే తానుసినిమాలు చేస్తున్నానని పవన్ కల్యాణ్ పలుమార్లు చెప్పారు. దానికి తగ్గట్లుగానే తన ఆదాయంలో చాలా వరకూ పార్టీకి విరాళంగా ఇస్తున్నారు.