జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శల వేడి మళ్లీ పెంచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లతోపాటు ప్రతిపక్ష పార్టీ, భాజపాలను కూడా వదలకుండా విమర్శలు గుప్పించారు. ఇచ్ఛాపురంలో జరిగిన బహిరంగ సభలో పవన్ సుదీర్ఘంగా ప్రసంగించారు. కొత్త తరహా పాలన అందించడం కోసం జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు. తాను ఇతర నేతల్లా మోసాలు చెయ్యననీ, ప్రజలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో టీడీపీకి ఎందుకు మద్దతు ఇచ్చారో మరోసారి చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తారా అని చంద్రబాబును అప్పట్లో అడిగితే.. తనను నమ్మాలని చెప్పారనీ, అలాగే నమ్మి ఇన్నాళ్లూ వేచి చూసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ నేరుగా పోటీ చెయ్యనందుకు ప్రజలను క్షమించమని కోరుతున్నానని పవన్ అన్నారు.
జనసేన నాయకులు అంటే బానిసలు కాదన్నారు. తమకి ఓ పదో పదిహేనో సీట్లిస్తే పడుంటామనీ, కుక్కు బిస్కెట్లు వేసినట్టుగా టీడీపీ నేతలు మాట్లాడారు అన్నారు. కానీ, ఒకరి దయాదాక్షిణ్యాల అవసరం జనసేనకు లేదనీ, కావాలంటే ఇతరులకు జనసేనే టిక్కెట్లు ఇస్తుందన్నారు. తమను టీడీపీ, భాజపా, వైకాపా వాళ్లు కూడా విమర్శిస్తున్నారన్నారు. కానీ, తాము ప్రజల పక్షమని చెప్పారు. జనసేనకు ఒక వ్యవస్థ లేదని చాలామంది విమర్శిస్తున్నారనీ… వ్యవస్థ లేకుండా, నిర్మాణం లేకుండా ఇంతమంది జెండాలు పట్టుకుని ఎలా వచ్చారు అన్నారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ.. జనసేన పోరాటం చేసిందా, ఇతర పార్టీలు చిత్తశుద్ధితో ప్రయత్నించాయా అనేది చర్చించడానికి సిద్ధమా అని సవాల్ చేశారు. నిపుణులతో తాను ఏర్పాటు చేసిన నిజ నిర్థారణ కమిటీ లెక్కలు తేల్చిందనీ, వాటిపై ఇంతవరకూ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదన్నారు.
ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి నారా లోకేష్ గురించి మాట్లాడుతూ… అధికారం వారి చేతిలో ఉంది, ఖజానా తాళాలు వారి దగ్గరే ఉన్నాయి.. ఆయన గురించి ఇంకేం మాట్లాడతా అని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న జనసైనికుల కుటుంబాలకు పింఛెన్లు ఆపినా, బెదిరించినా, వారిపై కేసులు పెట్టినా క్షమించే వ్యక్తులం కాదని హెచ్చరించారు. భాజపా స్క్రిప్టుతో తాను మాట్లాడుతున్నానని సీఎం అంటున్నారనీ, తనకు ఆ పార్టీ బంధువా చుట్టమా అని ప్రశ్నించారు. ప్రతిపక్షం గురించి మాట్లాడుతూ… ఉద్దానం లాంటి సమస్యపై తాను మాట్లాడినప్పుడు కొంత స్పందన వస్తే, ప్రతిపక్షంగా వైకాపా ఎంత చెయ్యొచ్చు, కానీ ఎందుకు చెయ్యలేదన్నారు. అసెంబ్లీ సమావేశాలకే రానివారు ప్రజా సమస్యలను ఎక్కడ చర్చిస్తారు, ఎలా పరిష్కరిస్తారు అని ప్రశ్నించారు. తనకు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉండి ఉంటే, ఈపాటికి ఉద్దానం సమస్యపై స్పష్టమైన పరిష్కార మార్గం వచ్చేలా ప్రయత్నించేవాడిని అన్నారు.
పవన్ ప్రసంగంలో గణనీయమైన మార్పు ఏంటంటే… ఎన్నికల హామీలు ఇచ్చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అంటూ మెల్లగా మొదలుపెట్టారు. ఓ పాతికేళ్ల ప్రయాణానికి సిద్ధం కావాలంటూ ఆ మధ్య జనసైనికులకు పిలుపునిచ్చిన పవన్… ఇప్పుడు వచ్చే ఎన్నికల్లోనే అధికార సాధన అనే కాన్సెప్ట్ కి వచ్చారు.