పవన్ కల్యాణ్ మిత్రుడు, కమెడియన్ అలీ.. వైసీపీలో చేరడం.. ఓ విచిత్రం. ఆయన మూడు పార్టీలతో చర్చలు జరిపి…చంద్రబాబుతో… సినీ జీవితంలో సాధించిన విజయాలకు చంద్రబాబుతో సన్మానాలు చేయించుకుని… ఇక టీడీపీలో చేరడమే ఖాయమనుకున్న తర్వాత.. ఓ ఉదయం వైసీపీలోచేరిపోయారు. గుంటూరు తూర్పు సీటును టీడీపీ నుంచి ఆశిస్తే… ఆయనకు అంతర్గత సర్వేలో సానుకూలత రాని కారణంగా.. టీడీపీ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో.. వైసీపీలో చేరిపోయారు. కానీ.. వైసీపీలో ఎందుకు చేరారు…? టిక్కెట్ ఇవ్వకపోతే.. ఆ పార్టీలో చేరాల్సిన అవసరం ఏమిటి..? ఇది చాలా మందికి అర్థం కాని విషయం. కానీ దీనికి ఆయన మిత్రుడు పవన్ కల్యాణ్ అసలు విషయం బయట పెట్టారు. అలీకి ఎంపీ టిక్కెట్ ఇస్తామని చెప్పి పార్టీలో చేర్చుకున్నారట. ఆలీని వైసీపీ నేతలు వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఆలీకి ఎంపీ టికెట్ ఇస్తామంటేనే వైసీపీలో చేరాడన్నారు. ఆలీ చెప్పినవాళ్లకు టికెట్లు ఇచ్చినా వైసీపీలో చేరాడని పవన్ మండిపడ్డారు. ఆలీ లాంటి వారిని నమ్మను..మనిషిని మనిషిగా చూస్తానన్నారు. అందుకే ప్రజలను తప్ప బంధుమిత్రులను నమ్మడం లేదని పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కష్టాల్లో ఆలీకి అండగా ఉన్నా.. స్నేహమంటే ఇదేనా? అని పవన్ ప్రశ్నించారు. అలీ సొంత ఊరు.. రాజమండ్రిలో జరిగిన ప్రచారసభలో పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సభలో జగన్మోహన్ రెడ్డిపై పవన్ కల్యాణ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు. తండ్రి శవం దొరక్కముందే సీఎం కావాలనుకున్న.. జగన్ రాష్ట్రానికి అవసరమా? అని ప్రశ్నించారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు.. వైఎస్ బావమరిది రవీంద్రారెడ్డి సినిమా తీయాలని బెదిరించారని… జగన్ ఇంట్లో వాటా ఇమ్మంటే ఇస్తారా? అని ప్రశ్నించారు.
బెదిరిస్తే తోలు తీస్తానని హెచ్చరించారు. మొత్తానికి.. అలీ వైసీపీలో చేరినప్పుడు.. రాజమండ్రి కానీ.. విజయవాడలో కానీ టిక్కెట్ ఇస్తే పోటీ చేస్తానని చెప్పారు.
తీరా టిక్కెట్ల కేటాయింపులో మాత్రం ఆయనకు అవకాశం చిక్కలేదు. కానీ ఆయనను.. ప్రచారంలో మాత్రం.. వైసీపీ నేతలు వాడుకుంటున్నారు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న చోట… ఆయనతో ప్రచారం చేయించుకుంటున్నారు. దీనిపైనే పవన్ కల్యాణ్ స్పందించారు. మొత్తానికి తనకు ఎంపీ టిక్కెట్ ఇస్తామని.. చెప్పి పార్టీలో చేర్చుకున్నట్లు.. తన ఆప్తమిత్రుడికి.. అలీ చెప్పారన్న విషయం మాత్రం స్పష్టమయింది.