జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో సమావేశం కానున్నారు. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ఈ ములాఖత్ జరగనుంది. చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత ప్రభుత్వ కుట్రేనని పవన్ తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. తాము వచ్చిన తర్వాత వదిలే ప్రసక్తే లేదంటున్నారు. లోకేష్‌కు కూడా ఫోన్ చేసి సంఘిభావం తెలిపారు. క్వాష్ పిటిషన్‌పై విచారణ వారం రోజులకు వాయిదా పడింది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదు.
దీంతో చంద్రబాబుతో జైలులోనే ములాఖత్ కావాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటి వరకూ టీడీపీ, జనసేన అధికారికంగా పొత్తులు పెట్టుకోలేదు. అయినప్పటికీ ఇక ప్రభుత్వంపై ఉమ్మడి కార్యాచరణను ప్రకటించాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. జనసేన నేతలు ఇప్పటికే లోకేష్ ను కలిసి సంఘిభావం తెలిపారు. త్వరలో రెండు పార్టీలు ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించే అవకాశం ఉంది. తప్పుడు కేసు .. ఒక్క సాక్ష్యం లేకుండా ఉద్దేశపూర్వకంగా ఇరికించి.. అరెస్టు చేశారని.. దీన్ని కోర్టులో నిరూపించి.. కుట్రలు చేసిన వారిపైనే ఎదురు కేసులు పెట్టించాలన్న ప్లాన్ లో టీడీపీ వర్గాలున్నాయని అంటున్నారు.
చంద్రబాబుతో భేటీ తర్వాత పవన్ కల్యాణ్ నారా లోకేష్ ను కూడా కలిసే అవకాశం ఉంది. నారా లోకేష్ కూడా రాజమండ్రిలోనే ఉంటున్నారు. పవన్ కల్యాణ్.. గతంలో రెండు, మూడు సార్లు చంద్రబాబుతో సమావేశం అయ్యారు కానీ అప్పట్లో లోకేష్ లేరు. ఇప్పుడు లోకేష్‌తో పవన్ సమావేశం కానున్నారు.