జనసేన అధినేత పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటనలకు వెళ్తున్నారు. అయితే.. అన్ని పార్టీల్లా.. వెళ్లి ర్యాలీలు చేసి.. ప్రసంగాలు చేసి… వచ్చేయడం లేదు. పవన్ కల్యాణ్ కొత్తగా ఆలోచించారు. రెండు రోజుల పాటు.. పార్టీ నేతలు, కార్యకర్తలకు.. విజ్ఞానాన్ని అందించడం.. సమాజం కోసం ఎలా రాజకీయం చేయాలో నేర్పించడం మాత్రమే కాదు.. తాను స్వయంగా వారితో ముచ్చటించాలని నిర్ణయించారు. తన పార్టీకి తొలి సీటు అందించిన రాజోలు నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్.. గురువారం నుంచే ఈ వినూత్న మేథోమథన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. జనసేన పార్టీని జనంలోకి తీసుకువెళ్లేలా జనసేనాని.. వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు గోడల మధ్యనే సమీక్షలు, సమావేశాలు నిర్వహించిన పవన్ కళ్యాణ్ తన పంధాను మార్చుకున్నారు.
ఎన్నికలలో ఘోర పరాజయం అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శైలి మారింది. కొంతమంది ముఖ్య నాయకులతో మాత్రమే సమావేశాలు నిర్వహించి నిర్ణయాలు తీసుకునే పవన్ కళ్యాణ్.. ఇప్పుడు అబిమానులు, ప్రజలను నేరుగా కలిసి.. వారి అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకోవాలని నిర్ణయించారు. తూర్పుగోదావరి జిల్లా దిండిలో జనసేన మేధోమధన సదస్సును గురు,శుక్రవారాల్లో నిర్వహిస్తున్నారు. జనసేనను జనానికి దగ్గర చేసేలా అభిమానులు, ద్వితీయ శ్రేణి నేతకు దిశానిర్దేశంచ ేయనున్నారు. వారందరి అభిప్రాయాలు, ఆలోచనలు తెలుసుకుంటారు. ఎన్నికలకి ముందు పవన్ ని కలవాలని ఎవరైనా వస్తే చాలామందిని దాటుకుని పవన్ దగ్గరకి రావాల్సి వచ్చేది. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేయాలని అనుకుంటున్నారు.
మేథోమథన కార్యక్రమంలో జనసేన నేతల్ని పవన్ నేరుగా కలుస్తారు. ఈ మేథోమథన కార్యక్రమాల్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా జనసేనాని తో కలిసి పాల్గొననున్నారు. వారు కూడా జనసైనికులకు దిశానిర్దేశం చేస్తారు. ఎన్నికల తర్వాత రాజధాని దాటి.. తొలిసారిగా బయట నిర్వహిస్తున్న మేథోమథనం కావడంతో…జనసేన నేతలు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేథోమథనం విజయవంతమైతే.. అదే స్పూర్తితో.. అన్ని జిల్లాల్లోనూ ఇదే తరహాలో సమావేశాలు ఏర్పాటు చేసి.. గ్రామీణ స్థాయి నుంచి జనసేన పార్టీని బలోపేతం చేసేలా ప్రణాళికలు సిద్దం చేయాలని నిర్ణయించుకున్నారు.