నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో బీజేపీ మద్దతుతో జనసేన పోటీ చేయబోతోందా..? అన్ని ఉపఎన్నికల స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ… నాగార్జున సాగర్‌లో మాత్రం అభ్యర్థిని ప్రకటించలేదు. అదే సమయంలో జనసేన పార్టీతో పొత్తును కొనసాగించాలన్న పట్టుదలతో ఉంది. దీంతో సాగర్‌ను జనసేనకు అప్పగించాలన్న ప్రతిపాదనలు వెళ్లినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే… తిరుపతిలో పోటీ చేయడానికి బీజేపీకి జనసేన నేతలు ఓకే చెప్పారు. తాము మద్దతిస్తున్నారు. ఇప్పుడు.. సాగర్ నుంచి కూడా బీజేపీ పోటీ చేయడం అంటే పొత్తు ధర్మాన్ని పాటించకపోవడమేనని.. జనసేనకు ఇస్తే బెటరన్న చర్చ జరుగుతోందని అంటున్నారు. అందుకే… జనసేన పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.
నాగార్జునసాగర్‌లో పోటీ చేసేందుకు జనసేన అభ్యర్థిని ఎంపిక చేసింది నేడో రేపో నామినేషన్ కూడా వేయబోతున్నారు. జనసేన పార్టీ ఎస్టీ అభ్యర్థినే నిలబెట్టబోతున్నట్లుగా సమాచారం బయటకు వచ్చింది. సాగర్ పై జనసేనాని పవన్ దృష్టి సారించి… ఓ కమిటీని నియమించారు. ఆ కమిటీ ఇప్పటికే అభ్యర్థిని ఫైనల్ చేసింది. బీజేపీతో సంబంధం లేకుండా జనసేన ప్రచారకమిటీని నియమించింది. ఆ పార్టీ చాపకింద నీరులా ప్రచారం చేసుకుంటోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం తర్వాత తెలంగాణ బీజేపీ నేతలకు కూడా జ్ఞానోదయం అయింది. జనసేనతో కలిసి పని చేస్తామని చెప్పడం ప్రారంభించారు. గతంలో చేసినట్లుగా అతి వ్యాఖ్యలు చేయడం లేదు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం.. నల్లగొండ స్థానంలో నాలుగో స్థానం రావడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని… బీజేపీ పోటీ చేయకపోతేనే ఇప్పుడున్న హైప్ ఉంటుందని.. ఒక వేళ పోటీ చేసి డిపాజిట్ కూడా తెచ్చుకోకపోతే.. మొత్తానికే మోసం వస్తుందని కమలనాథులు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే సాగర్ టికెట్ ను జనసేనకు వదిలేస్తే.. రాజకీయంగా బీజేపీ ఆత్మహత్య చేసుకున్నట్లేనని కొంత మంది నేతలు హెచ్చరిస్తున్నారు. సాగర్ నియోజకవర్గం అంశంపై బీజేపీలో ఊపు తగ్గిపోవడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి రెండు వేల ఓట్లు తెచ్చుకున్న నివేదితారెడ్డి మళ్లీ బీజేపీ అభ్యర్థిగానే నామినేషన్ వేశారు. అయితే ఆమెకు బీఫాం దక్కడం అనుమానమే.