రాజుల కాలంలో ప్రజల పై రక రకాల పన్నులు వేసే వారు. ప్రత్యేకించి ఢిల్లీ సుల్తా నుల కాలం లో కొందరు రాజులు గడ్డం పెంచితే పన్ను, పశువులు పెంచుకుంటే పన్ను లాంటి రక రకాల పన్నులు వేసేవారు. ఢిల్లీ సుల్తానుల లో ఒకరైన తుగ్లక్ పాలన లో ఇటు వంటి పన్నులు మరీ ఎక్కువగా ఉండేవని చరిత్రకారులు చెబుతుంటారు. అయితే ప్రజాస్వామ్య దేశాలలో కూడా అనేక రకాల ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నులు వసూలు చేస్తున్నారు. కానీ తాజా గా ఆంధ్ర ప్రదేశ్ లో చెత్త పన్ను విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇలా చెత్త పన్ను వేయడాన్ని జన సేన పార్టీ విమర్శించింది. వివరాల్లోకి వెళితే..
జన సేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ పేరిట ఆ పార్టీ ఒక లేఖను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లో చెత్త పన్ను వేయడం ప్రజలను పీడించడమే అంటూ జనసేన నేత వ్యాఖ్యానించారు. ఆయన రాసిన లేఖలో, ” రాష్ట్ర వ్యాప్తం గా ప్రజలు కరోనా తో తీవ్ర భయాందోళనల కు లోనై ఆర్థికంగా కష్టాలు పడుతూ ఉంటే, వారి లో ధైర్యాన్ని నింపి వారి బతుకు బండి గాడిన పడేలా చేయాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించింది. పైగా ప్రజల నుండి కొత్త కొత్త పనులు ఎలా వసూలు చేయాలి , ఉన్న పన్నులు ఎలా పెంచాలి అనే విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. మున్సిపాలిటీ లలో చెత్త పన్ను పేరుతో ప్రజలను పీడించే కార్యక్రమాని కి వైసిపి ప్రభుత్వం సిద్ధపడడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. చిరు వ్యాపారుల నుండి, తోపుడు బళ్ల ద్వారా జీవనం పొందే వారి నుండి కూడా చెత్త పన్ను ముక్కు పిండి వసూలు చేయబోతున్నారు . సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు ఇస్తున్నాం అని చెబుతున్న అధికార పక్షం వాళ్ళు ఈ చెత్త వ్యవహారం పై ఏం సమాధానం చెబుతారు. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో గుంజుకోవడమే ఇది. ప్రజలు ఉపాధి కి, వ్యాపారాలకు దూరమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో తగిన చర్యలు తీసుకోవాలి తప్ప ప్రతి నెల చెత్త పన్ను కట్టాలి అనడం బాధాకరం. మానవతా దృక్పథంతో పాలకులు ఆలోచన చేయడం లేదని అర్థమవుతోంది . రాబోయే రోజులలో ఇంకెన్ని పన్నులను ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు భరించాల్సి వస్తుందో.
మున్సిపాలిటీ అయినా గ్రామాలైనా పారిశుద్ధ్య నిర్వహణ ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు ప్రభుత్వం ఇలాంటి పన్నులు విధిస్తోంది. వైసిపి ప్రభుత్వం ఈ రెండేళ్ల లో ఏ నగరం లో అయినా ఏ పట్టణం లో అయినా ఒక్క డంపింగ్ యార్డ్ లో అయినా ఆధునిక విధానాలతో చెత్త తొలగించి, పర్యావరణ హితమైన విధానాలతో చెత్త నుంచి సంపద సృష్టించే పనులు చేపట్టిందా? ఇలాంటి ఆలోచనలు వదిలి పన్ను వేస్తామని అనడం తప్పుడు నిర్ణయమే అవుతుంది . గతం లో చెత్తను ఎరువు గా మార్చేందుకు కేంద్రాల ని నిర్మించారు. వాటి ద్వారా రాబడి వస్తుందని చెప్పారు. అసలు ఆ కేంద్రాల నిర్వహణ ఎలా ఉంది . దాని మీద రాబడి వస్తుంటే ఇప్పుడు ఎందుకు పన్నులు వసూలు చేస్తున్నారు అనే విషయాలపై ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పన్ను వసూలు కోసం మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు తీర్మానాలు చేసుకుని ప్రజల నుండి పన్ను వసూలు చేయడానికి సిద్ధమయ్యాయి. పారదర్శకత లేకుండా పన్నులు వసూలు చేయబోతున్నారు. చెత్త పన్ను విధించాలనే ఆదేశాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి ” అని ఆయన పేర్కొన్నారు.
కరోనా సమయంలో ఇటువంటి అనవసర పన్నులు విధించడం ప్రజలలో కూడా వ్యతిరేకతను తీసుకుని వస్తుంది. మరి జగన్ ప్రభుత్వం దీని పై తిరిగి ఆలోచిస్తుందా లేక తాము ముందుగా నిర్ణయించుకున్న విధంగా ముందుకు వెళ్తుందా అన్నది వేచి చూడాలి.