ఆంద్రప్రదేశ్ లో తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేసిన పదో తరగతి ఫలితాలు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 32 శాతం విద్యార్థులు ఈసారి ఫెయిల్ అవ్వడం విస్మయం కలిగించింది . ఈ పరిణామాలపై జనసేన పార్టీ స్పందించింది. వివరాల్లోకి వెళితే..
జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇది ప్రభుత్వ వైఫల్యం అని అభివర్ణించారు. పదో తరగతి పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్ధుల వద్ద నుండి ఫీజు వసూలు చేయకుండా ఉచితంగా సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేసారు. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి సారిగా 2,01,627 (32.74 శాతం) మంది పదోతరగతి పరీక్షల్లో ఫెయిల్ కావడం ప్రభుత్వ వైఫల్యమే అని, ఉపాధ్యాయులను బోధనేతర పనులకు ఉపయోగించడం, పరీక్షల సమయంలో పేపర్లు లీక్ కావడం తదితర కారణాలు విద్యార్ధులపై ప్రభావం చూపాయని అన్నారు. విద్యాబోధనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వ హయాంలో 71 పాఠశాలల్లో ఒక్కరూ పాస్ కాకపోవడం, అందులో 22 ప్రభుత్వ పాఠశాలలే ఉండడం సిగ్గుచేటు అని, ప్రభుత్వం ఆన్ లైన్ లో విడుదల చేసిన మార్క్స్ షీట్ లలో పాస్ అయిన సబ్జక్టులకు ‘F: అని, ఫెయిల్ అయిన సబ్జక్టులకు ‘P’ అని పెట్టడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం అని, ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యంగా జనసేన పార్టీ భావిస్తోందని అన్నారు. కాబట్టి ఫెయిల్ అయిన విద్యార్థుల నుండి ఫీజు వసూలు చేయకుండా పూర్తిగా ఉచితంగా సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించాల్సిందిగా జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు.
ఇటీవల మీడియా, ముఖ్యమంత్రి సమక్షంలో కొంతమంది విద్యార్థుల తో ఇంగ్లీషులో మాట్లాడించి. ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ చాలా అద్భుతంగా ఉందని ప్రకటించిన వై ఎస్ ఆర్ సి పి నేతలు క్షేత్రస్థాయిలో పదో తరగతి ఫలితాలు ఇంత దారుణంగా రావడంపట్ల స్పందించడానికి మాత్రం ముందుకు రాకపోవడం కొస మెరుపు.