రోడ్ల దుస్థితిపై జగన్ పెట్టిన డెడ్ లైన్ ముగిసిందని అయినా ఎక్కడ రోడ్లను బాగు చేయకపోగా ఇంకా దారుణంగా తయారయ్యాయని జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభించింది. గుడ్‌మార్నింగ్ సీఎం సార్ పేరుతో ఉదయం నుంచి ట్వీట్లు చేయాలని జనసేనానికి పిలుపునిచ్చారు. తాను కూడా చేస్తానన్నారు. ఆ ప్రకారం #GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్లు వెల్లువెత్తాయి. ట్విట్టర్ ట్రెండింగ్‌లో ఆ హ్యాష్ ట్యాగ్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. మధ్యాహ్నానికే రెండు లక్షల 70వేలకు పైగా ట్వీట్లతో ఎవరూ అందుకోలేనంత ఎత్తులో నిలిచింది.
ప్రతి ఒక్క ట్వీట్లో రోడ్ల దుస్థితి బట్టబయలైంది. అత్యంత దారుణంగా మారిన రహదారులు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సోషల్ మీడియాలో పెట్టారు. ప్రజల్లో అసహనం ఏ స్థాయిలో ఉందో కూడా వివరించారు. అది జనసేన చేపట్టిన డిజిటల్ ఉద్యమమే అయినా ప్రజాగ్రహం కనిపిస్తోంది. రోడ్ల విషయంలో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసహనం కనిపస్తోంది. జనసేన ఉద్యమంతో ఆ విషయం స్పష్టంగా తెలుస్తోంది.
మరో రెండు రోజుల పాటు ఈ డిజిటల్ క్యాంపెన్ నిర్వహించాలని జనసేనాని నిర్ణయించారు. మరో రెండు రోజులూ ఈ అంశం ట్విట్టర్ ట్రెండింగ్‌లో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. కానీ ప్రభుత్వం కనీస మాత్రంగా అయినా పట్టించుకుంటుందా అన్నదే సందేహంగా మారింది.