ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల దుస్ధితి గురించి అంతర్జాతీయంగా తెలుసు. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నా మూడేళ్ల నుంచి వేల కోట్ల కబుర్లను సీఎంజగన్ చెబుతున్నారు కానీ ఒక్క రోడ్డును బాగు చేసిన పాపాన పోలేదు. గత నెల లో సమీక్ష చేసిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జూలై పదిహేనో తేదీ కల్లా మున్సిపాలిటీల్లో రోడ్లన్నింటికీ మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఖచ్చితంగా చేసి చూపిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అలా చేయడమే కాదు.. నాడు – నేడు పేరుతో ఆ రోడ్ల ఫోటోలను ప్రదర్శనకు పెట్టాలని కూడా జగన్ ఆదేశించారు. ఇప్పుడు జాలై 15వ తేదీ ముంచుకొచ్చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో గత వారం రోజులుగా వర్షాలు పడుతున్నాయి. దీంతో ఏపీలో రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది. గంతలు లేని రోడ్డే లేకుండా పోయింది. దీంతోప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. చాలా చోట్ల గుంతలు తప్ప రోడ్లు కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి రోడ్ల దుస్థితిని చాలా మంది సోషల్ మీడియాలో పెట్టి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి చెప్పిన జూలై 15 దగ్గరకు వచ్చినా ఇదా పరిస్థితి అని ప్రశ్నిస్తున్నారు. సీఎం పెట్టిన జూలై 15 డెడ్ లైన్ ప్రకారం కూడా ఏ రోడ్ బాగుడదని …తాజా స్టేటస్ చూస్తే తెలిసిపోతుంది. సమయం ముంచుకొచ్చినా ఎక్కడా పనులు జరగడంలేదు.
దీనిపై జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించాలని నిర్ణయించింది. సీఎం జగన్ జూలై 15వ తేదీన డెడ్ లైన్ పెట్టినందున ఆ రోజు నుంచి మూడు రోజుల పాటు గుడ్‌మార్నింగ్ సీఎం సార్ హ్యాష్ ట్యాగ్‌తో రోడ్ల దుస్థితిపై క్యాంపెయిన్ నిర్వహించాలని నిర్ణయించారు. గతంలో జనసేన పార్టీ ఓ సారి డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించింది. పవన్ కల్యాణ్ స్వయంగా శ్రమదానం కూడా చేశారు. మూడో రోజుల పాటు ఏపీ రోడ్లపై జగన్ మాటలను.. రోడ్ల తీరును జనసేన హైలెట్ చేయనుంది.