నిన్న టిఆర్ఎస్ గెలుపు అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పిన విషయం తెలిసిందే. చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టినప్పుడు తామెందుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టకూడదని ప్రశ్నించిన కెసిఆర్ తప్పకుండా దేశ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న కారణంగా ఆంధ్రప్రదేశ్లో కూడా తాము అడుగుపెడతానని వ్యాఖ్యానించారు.
ఈ లెక్కన కెసిఆర్ ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల్లో ఏదో ఒక పార్టీకి బాహాటంగానో, లేదంటే అంతర్గతంగానో మద్దతిస్తారని అంచనాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన టీవీ డిబేట్ లో టీవీ 9 రజినీకాంత్ టిఆర్ఎస్ నేతను ప్రశ్నిస్తూ ఒకవేళ మీరు ఆంధ్ర రాజకీయాల్లో అడుగు పెడితే ఏ పార్టీతో జత కడతారని అడిగారు. దానికి టిఆర్ఎస్ నేత స్పందిస్తూ కచ్చితంగా భావసారూప్యం ఉన్న పార్టీలతో జత కడతామని వ్యాఖ్యానించారు. అయితే దీనికి జవాబిస్తూ టీవీ9 రజనీకాంత్, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ మాదిరిగా ఎన్నో పార్టీలు లేవని అక్కడ ఉన్నది కేవలం రెండే పార్టీలు అని ఒకటి తెలుగుదేశం రెండవది వై ఎస్ ఆర్ సి పి అని వ్యాఖ్యానిస్తూ, ఇక మూడవ పార్టీగా జనసేన ఏదో నామ్ కే వాస్తే ఉండాలంటే ఉంది అన్నట్టుగా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగకుండా కేసీఆర్ లాంటి మెచ్యూరిటీ ఉన్న నేత జనసేన లాంటి చిన్న పార్టీతో జత కడతారని తాను అనుకోవడం లేదని కూడా అనేశారు.
అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జనసేన అభిమానులు టీవీ9 రజనీకాంత్ వ్యాఖ్యల పై మండిపడుతున్నారు. జనసేన అధినేత పవన్కళ్యాణ్ ప్రజాపోరాట యాత్ర చేస్తూ, ప్రజల్లో ఉంటూ, అనేక సమస్యల గురించి మాట్లాడుతుంటే వాటి గురించి ఎన్నడూ చిన్న స్క్రోలింగ్ కూడా ఇవ్వకుండా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న టీవీ9 ఇప్పుడు జనసేన పార్టీ ఉనికి లో నే లేదు అనడం ఎంతవరకు సబబు అని వారు ప్రశ్నిస్తున్నారు. ఆ మధ్య మహా టీవీ లో మూర్తి అనే ఒక యాంకర్ కూడా జనసేన పార్టీ గురించి అవాస్తవాలు ప్రచారం చేసి, ఆ కథనానికి ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఇబ్బందుల్లో పడిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. అంతేకాకుండా ఎన్నికల్లో గెలిచాక టిఆర్ఎస్ పార్టీ మోస్తున్న టీవీ9 గతంలో ఇదే టిఆర్ఎస్ పార్టీ ని కూడా చిన్న పార్టీ లాగే చూసింది అని కూడా గుర్తు చేస్తున్నారు.
ఏది ఏమైనా అగ్ర మీడియా సపోర్ట్ లేకపోయినప్పటికీ, సోషల్ మీడియానే ఆయుధంగా చేసుకుని జనసైనికులు బలమైన మీడియాతో రోజూ పోరాడుతూనే ఉన్నారు
– జురాన్ (@CriticZuran)