తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేడెక్కింది. అన్ని పార్టీలు.. ఉదయం నుంచి సాయంత్రం వరకూ.. మీడియా ముందో.. మరో చోటో.. ఏదో ఒకటి ప్రజలకు చెప్పి.. ప్రజల్లోనే ఉండేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఒక్క జనసేన పార్టీకి మాత్రమే ఈ మినహాయింపు. ఆ పార్టీ ఏం చేస్తుందో.. ఎవరికీ తెలియడం లేదు. ఆ పార్టీ అధినేత.. ఏ మేధావులతో చర్చిస్తున్నారో అప్ డేట్ లేదు. పోరాటయాత్ర ఎప్పుడో అటకెక్కింది. ఎప్పుడు ప్రారంభమవుతుందో.. ఎప్పుడు ముగస్తుందో.. ఆ పార్టీ నేతలకే అర్థం కావడం లేదు. ఎన్నికలు ముంచుకొస్తున్నాయి.. ఏమీ చేయకపోతే.. ఎవరైనా ఏమైనా అనుకుంటారనుకున్నారేమో కానీ… ఫ్యాన్స్‌కు ” సభ్యత్వాలు, జెండా దిమ్మ” చాలెంజ్ విసిరారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
ఎన్నికల సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో పార్టీ సభ్యత్వాన్ని పెంచుకొనే వ్యూహాలకు పదును పెడుతున్నారు. దీనిలో భాగంగా పవన్అభిమానులకు సామాజిక మాధ్యమాల వేదికగా ఆ పార్టీ పిలుపునిచ్చింది. నిజమైన జనసైనికులు సత్తా చూపాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంటూ వారికి టార్గెట్విధించింది. సినిమా రిలీజ్ అయితే థియేటర్వద్ద చేసిన సంబరాల మాదిరిగానే ఇప్పుడు గ్రామ గ్రామానా సభ్యత్వ నమోదుతో సందడి చేయాలని పిలుపునిచ్చింది. సినిమా థియేటర్లను అలంకరించేబదులుగా ఆయా గ్రామాలు, నగరాల్లో జెండా దిమ్మలు ఏర్పాటు చేయాలని అభిమానులను కోరింది. ఈ నెల 9 లోపు ఒక్కొక్కరు వంద సభ్యత్వాలు చేర్పించడంతో పాటు పది మంది కలిసి జెండా దిమ్మలు ఏర్పాటు చేసి పవన్ అభిమానుల సత్తా ఏంటో చాటాలని సూచించింది.
ఈ నెల తొమ్మిదా అని ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అంతే.. ఈ నెల తొమ్మిదే.. అంటే ఈ రోజే. ఇలా పోస్టు పెట్టి.. రెండు రోజుల్లోనే సభ్యత్వాలు, జెండా దిమ్మల పెట్టేసి… రెండు రోజుల్లో… గ్రామగ్రామాన విస్తరించే ప్రణాళికను…ఒక్క ఫేస్ బుక్ పోస్టు ద్వారా జనసేన చేయాలనుకుందన్నమాట. మరి తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై ఆ పార్టీ స్పందన ఏమిటి..?. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయట. ఎన్నికల వేళ జనసేన అనుసరించాల్సిన వ్యూహాలపై రాజకీయ వ్యవహారాల కమిటీ చర్చించిందట. దీనిపై ఓ నివేదిక రూపొందించి పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు ఇవ్వాలని నిర్ణయించిందట. ఆ పై ఆదివారం.. పవన్ తో చర్చిస్తారట. ఎన్నికల విషయంలో.. ఏ పార్టీకి లేనంత క్లారిటీ జనసేనకు ఉందన్నమాట…!