జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ సారి తమ పార్టీ ఆవిర్భావ సభకు వేదికగా మచిలీపట్నాన్ని నిర్ణయించారు. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న పేర్ని నాని.. జనసేనానిపై వాడే భాష గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన నియోజకవర్గ గడ్డపైనే ఆవిర్భావ సభను ప్లాన్ చేశారు. జనసేన ఏర్పాటు చేసి.. ఈ ఏడాది పదేళ్లు నిండుతున్నాయి. 10 వ ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 14 వ తారీఖున ” మచిలీపట్నం ” లో నిర్వహించాలని నిర్ణయించడమే కాకుండా.. మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి సభా ప్రాంగణానికి పవన్ కళ్యాణ్ వారాహి వాహనంలో రోడ్ షో ద్వారా వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన ముందుకు వెళ్లేలా కార్యాచరణ ఉంటుందని నాదెండ్ల మనోహర్ చెబుతున్నారు. మచిలీపట్నం ప్రజలు ముందుకు వచ్చి సభ పెట్టాలని కోరారని.. 34ఎకరాల్లో ప్రత్యేకంగా సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. భద్రత పరంగా తగిన విధంగా అన్ని జాగ్రత్త లు తీసుకుంటామని.. వైసిపి ప్రభుత్వాన్ని ఇంటికి పంపే విధంగా జనసేన ప్రణాళిక ఉంటుందని ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసిపి కి వ్యతిరేకంగా ఓటు వేయాలని పవన్ కళ్యాణ్ తరపున నేను కోరుతున్నానని మనోహర్ తెలిపారు.
గత ఏడాది ఆవిర్భావ సభను ఇప్పటంలో నిర్వహించారు. చివరి వరకూ ఆవిర్భావ సభ కోసం ఇబ్బందులు తప్పలేదు. చివరికి రైతులు ముందుకు వచ్చి పొలం ఇవ్వడంతో సభ నిర్వహించారు. అయితే ఈ సారి ముందుగానే మచిలీపట్నంలో స్థలం ఖరారు చేసుకుని అధికారిక ప్రకటన చేసినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ కుట్రలను చేధించేలా.. సభను నిర్వహిస్తామని అంటున్నారు. పేర్ని నాని నియోజకవర్గంలోనే సభ పెట్టడంతో స్పీచ్ లో పంచులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.