భవిష్య కార్యాచరణపై స్పష్టమైన అవగాహన…రాజకీయాలలో ఎలా ముందడుగు వేయాలనే అంశంపై పటిష్టమైన ప్రణాళిక…ప్రజల్లోకి ఎలా దూసుకెళ్ళాలనే వైఖరిని పదునుపెట్టుకున్న తీరు.. ఈ మూడింటి కలబోతే ఆ నేత. 2014లో రాజకీయ యవనికపైకి అనూహ్యంగా దూసుకొచ్చిన తార. అంతులేని ప్రజాకర్షణ ఆయన బలం. అన్ని పార్టీల్లోనూ ఆయనకు అభిమానులున్నారు. ఆయనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్.
సోషల్ మీడియాలో ఆయనపైనా.. ఆయన వైఖరిపైనా సెటైర్లు. ప్రత్యర్థుల విమర్శలు. అలా వస్తారు.. ఇలా వెడతారంటూ ఎకసెక్కాలు. ఇవేవీ ఆయనకు పట్టవు. కారణం ఆయనకో లక్ష్యం ఉంది. ఆ దిశగా ఎలా అడుగులేయాలనే దానిపై అంతకంటే సుస్పష్టమైన ఆలోచనా ఉంది.
పార్టీని పటిష్టంగా నిర్మించుకోవడంపై ఆయన ప్రస్తుతం దృష్టిని కేంద్రీకరించారు. అనుభవజ్ఞుడే కాక, ఏ సమయంలో ఎలా వ్యవహరించాలో తెలిసిన జర్నలిస్టులు పవన్ కల్యాణ్ బృందంలో ఉన్నారు. లోపాయకారీగా పవన్ మనసులో మాట తెలుసుకోవాలని ప్రయత్నించిన సన్నిహితులకి కూడా వారు పీకే కార్యాచరణ ఏమిటో సూచన ప్రాయంగా కూడా ఓపెన్ కారు. పార్టీ నిర్మాణం, పవన్ కల్యాణ్ లక్ష్యాన్ని విజయవంతంగా చేరడం… ఇవే వారి విధులు.
మిగిలిన పార్టీలకు అధికార ప్రతినిధులుంటారు. సమయానకూలంగా వారు స్పందిస్తుంటారు. తప్పులు చేసి నాలుక కరుచుకుంటారు.. అప్పుడప్పుడు లెంపలూ వేసుకుంటారు. ఇలాంటి అంశాలకు పవన్ కల్యాణ్ పార్టీ సుదూరంగా ఉంటోంది. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి విమర్శపైనా..విశ్లేషణలపైనా వివరణలు ఇవ్వాలనుకోవడం లేదు. ఎందుకంటే అది సోషల్ మీడియా. వాటిపై స్పందించడానికి జనసేన కార్యకర్తలను పార్టీ సుశిక్షితంగా తయారుచేసుకుంటోంది.
అనంతపురంలో ఇటీవలే వాగ్ధాటి ఉన్న వారిని ఎంపిక చేసుకునే కార్యక్రమాన్ని చేపట్టింది. ఎవరొచ్చినా పార్టీ ఆహ్వానిస్తుంది. ఎవరినీ తిరస్కరించదు. అలాగని వచ్చిన వారందరినీ నెత్తికెత్తించుకోదు. వారిలో ఉన్న ప్రత్యేకతలను వెలికి తీసి, పార్టీకి ఏ విధంగా ఉపయోగించుకోవాలీ అనే అంశంపై శిక్షణ ఇస్తుందంటున్నారు. పార్టీ సిద్ధాంతాలు, సాధించాల్సినవీ, ఏ అంశంపై స్పందించాలీ.. స్పందించకూడదూ… సందర్భానుసారంగా అవగాహన కల్పిస్తోందంటున్నారు.
పార్టీ నిర్మాణంపై పటిష్టంగానూ వ్యూహాత్మంకంగానూ అడుగులేస్తున్న జనసేనాని తనపై వచ్చే విమర్శలకు స్పందిచననడం బాగానే ఉంది. ప్రజా సమస్యలపైనా అదే వైఖరిని అనుసరించడం ఎంతవరకూ సమంజసమో ఆలోచించాలి. వీటిపై ఎవరూ ఆయనకు వివరించాల్సిన అవసరం లేదు. బీజేపీపైనా.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుపైనా ఒకానొక సభలో పరుషంగా విమర్శలు గుప్పించిన పవన్ కల్యాణ్ ఆపై సైలెంటైపోయారు? అలా ఎందుకనేది కోటి రూకల ప్రశ్న. అంటే ఆయన తన స్థాయిని ఎంత ఎక్కువగా ఊహించుకుంటున్నారో తెలుసుకోవచ్చు.
చేనేత సమస్యలపై స్పందించి, తీసుకున్న స్టాండ్ పవన్ కల్యాణ్ సమయస్ఫూర్తిని చాటుతుంది. తాను చేనేత దుస్తులనే ధరిస్తానన్న ఆయన నిర్ణ్ణయం వేనవేలమందితో చప్పట్లు కొట్టించుకుంది.
ఇదే వైఖరిని మిగిలిన రంగాలపైనా ప్రదర్శించాలి. అన్ని సమస్యలపైనా పవన్ కల్యాణ్ చొరవ చూపాలి. ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అంశాలపై అంటీముట్టనట్లు వ్యవహరించడం.. తనదాకా వస్తేనే స్పందించాలనుకోడం ప్రజల్లోకి సకారాత్మక సందేశాలను పంపవు. ఒక వ్యక్తిగా అందరికీ వ్యక్తిగత జీవితాలుంటాయి.. అందులోకి ఎవరూ తొంగిచూడకూడదనడం కాదు తొంగిచూసే అవకాశమూ ఇవ్వకూడదు. శ్రీరామచంద్రుడికే ఇలాంటి సమస్య తప్పలేదు. జనసేన.. పవన్ కల్యాణ్ గారికి మాత్రమే సంబంధించిన పార్టీ అని తెలుగు ప్రజలు అనుకోవడం లేదు. ఆయన కూడా అలా అనుకోకూడదు. పేరులోనే జనాలను చేర్చుకున్న పవన్ ఎంపిక చేసిన స్థానాల్లోనే పోటీకి పరిమితం కాకూడదు. ఇలాంటి నిర్ణయాలు కచ్చితంగా విమర్శలకు తావిస్తాయి. కిందటి ఎన్నికల్లో టీడీపీ పక్షాన ప్రచారం చేసిన ఆయన 2019 ఎన్నికల్లో స్పష్టమైన వైఖరితో వ్యవహరించాలి. ఆయన తీసుకునే నిర్ణయాలు ఏ పార్టీకీ లబ్ధి చేకూర్చేవిగా ఉండకూడదు.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి