ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల శంఖారావాన్ని జనసేన పార్టీ ఆవిర్భావ సభలో వినిపించనుంది. మంగళగిరి మండలం కాజ దగ్గర ఇప్పటికే భారీసభ కోసం ఏర్పాట్లు ప్రారంభించారు. కొన్ని లక్షల మంది జనసైనికులు హాజరయ్యే అవకాశం ఉండటంతో దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించుకున్నారు. నిర్వహణ కోసం పవన్ కల్యాణ్ కమిటీలనుప్రకటించారు. స్థానికంగా, దూర ప్రాంతాల నుంచి వచ్చే జనసేన శ్రేణులు, నాయకులు, వీరమహిళలు, జనసేన అభిమానులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా కమిటీలు జాగ్రత్త వహించాల్సి ఉంది.
ఆవిర్భావ సభ నుంచి ప్రభుత్వంపై తాము చేయబోయే యుద్ధాన్ని పవన్ కల్యాణ్ ప్రకటించే అవకాశం ఉంది. టీడీపీ హయాంలో ఆయన పార్టీ ఆవిర్భావసభను ఎన్నికల ఏడాదిలో ఘనంగా నిర్వహించి తెలుగుదేశం పార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.అప్పట్నుంచి ఆయన పోరాటం ఎన్నికలయ్యే వరకూ సాగింది. ఈ సారి వైసీపీ ప్రభుత్వంపై ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే సమరం ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.
పవన్ కల్యాణ్ కూడా అప్పట్నుంచి ఎక్కువగా ప్రజల్లో ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా మరో రెండేళ్లకు పూర్తి స్థాయిలో ఎన్నికలు వస్తాయి. ముందస్తు ప్రచారం ఉండనే ఉంది. ఇప్పటికే ఏపీలో ఎన్నికల వాతావరణం ప్రారంభమయింది. ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా రంగంలోకి దిగితే పరిస్థితి వేరుగా ఉంటుంది. ప్రభుత్వం అనేక పాలనా వైఫల్యాలతో ఇబ్బంది పడుతోంది. ఈ అంశాన్ని ఆసరా చేసుకుని జనసేనను బలోపేతం చేసే దిశగా పవన్ ముందడుగు వేస్తున్నారని అనుకోవచ్చు.