ప్రధాని మోదీతో అలా భేటీ ముగిసిందో లేదో ఇలా ఏపీ బీజేపీ నేతలు అతి చేయడం ప్రారంభించారు. ఇక తెలుగుదేశంపార్టీతో జనసేన పొత్తే లేదని.. తమతోనే కలిసి పోటీ చేస్తుందని హంగామా చేయడం ప్రారంభించారు. సోము వీర్రాజు నుంచి విష్ణువర్ధన్ రెడ్డి వరకూ ఒకటే క్యాసెట్ వేశారు. జనసేనలోని .. ” పవనన్నను ప్రేమిస్తాం.. జగనన్నకు ఓటు వేస్తాం” బ్యాచ్ కూడా ఏమీ వెనక్కి తగ్గలేదు. ఇక వైసీపీ అనుకూల మీడియా సంబరం అంతా అంతా ఇంతా కాదు.
అయితే వీటన్నింటికీ జనసేన అధికారికంగా సమాధానం ఇచ్చింది. మోదీతో జరిగిన సమావేశం విషయంలో.. ప్రధానిని గౌరవిస్తామని.. ఒక్క విషయం కూడా బయటకు చెప్పబోమని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మోదీ, పవన్ ఏం చర్చించారు.. పొత్తులపై ఏం తేల్చాలంటూ మీడియాతో పాటు ఇతర పార్టీల నేతలు చేస్తున్న కామెంట్లను నాదెండ్ల కొట్టి పడేశారు. అవన్నీ అర్థరహితమన్నారు. పొత్తుల గురించి ఎన్నికల సమయంలో మాత్రమే మాట్లాడతామన్నారు. మూడు రోజుల నుంచి ఒకటే మ్యూజిక్‌ను .. వైసీపీతో పాటు ఆ పార్టీ ప్రో మీడియా.. బీజేపీ నేతలు ఇదే చెబుతూండటంతో జనసేన అధికారికంగా క్లారిటీ ఇచ్చినట్లయింది.
మోదీతో భేటీ తర్వాత పవన్ కల్యాణ్… విజయనగరం జిల్లా గుంకలాం వెళ్లినప్పుడు.. అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. వైసీపీని ఎదుర్కొనే పార్టీ తమదేనన్నారు. అలాగే చంద్రబాబు కూడా.. తానేమీ సినిమా యాక్టర్నుకాదని అయినా వెల్లువలా జనాలు వచ్చారని కర్నూలులో కామెంట్ చేశారు. దీంతో గతంలో కలిసి వైసీపీపై పోరాడదామనే మాటలకు బ్రేక్ పడిందన్న అభిప్రాయాన్ని బీజేపీ నేతలు వ్యాప్తి చేయడం ప్రారంభించారు. అయితే ఇప్పుడు వైసీపీ ముక్త ఏపీ కోసమే పని చేస్తామని నాదెండ్ల తేల్చేయడంతో ఇప్పటికైతే .. పొత్తులపై చర్చకు చెక్ పడినట్లేనని అనుకోవచ్చు.