రెండు రోజుల కిందట కడియం నుంచి వచ్చిన ఎంపీటీసీలతో పవన్ కల్యాణ్ సమావేశమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర హెచ్చరిక చేశారు. తమ పార్టీ ఎంపీటీసీలను లాక్కుంటే ఊరుకునేది లేదని స్వయంగా వచ్చి పోరాడతానని.. అలాంటి పరిస్థితి తెచ్చుకోవాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. అయితే ఈ రోజు కడియం మండలంలో వైసీపీ అభ్యర్థి మండల పరిషత్ చైర్మన్గా గెలవలేదు. అలాగని జనసేన ఎంపీటీసీ కూడా చైర్మన్ అవలేదు. తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ మండల పరిషత్ చైర్మన్ అయ్యారు.
కడియం ఎంపీపీగా టీడీపీ అభ్యర్థి సత్యప్రసాద్ ఎన్నికయినట్లుగా అధికారులు ప్రకటించారు. కడియం మండలంలో మొత్తం 21 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా తొమ్మిది చోట్ల గెలిచింది. కానీ ఎంపీపీ చైర్మన్ గిరీ కావాలంటే పదకొండు ఎంపీటీసీలు ఉండాల్సిందే. రెండు స్థానాలు తగ్గాయి. అందుకే జనసేన ఎంపీటీసీలపై కన్నేశారు. కానీ ఆ ప్రయత్నం సఫలం కాలేదు. అదే సమయంలో జనసేన ఎనిమిది మంది ఎంపీటీసీలను గెలిచింది. తెలుగుదేశం పార్టీ ఖాతాలో నాలుగు ఉన్నాయి. వీరిద్దరూ కలిస్తే పన్నెండు. ఎంపీపీ చైర్మన్ పదవి ఖాయం అవుతుంది.
అలాగే టీడీపీ, జనసేన కలిసి కడియంను గెల్చుకున్నాయి. అయితే అత్యధిక స్థానాలు ఉన్న జనసేనకు కాకుండా టీడీపీకే పరిషత్ చైర్మన్ పీఠాన్ని జనసేన ఇచ్చేసింది. దీనికి కారణం ఉంది. ఎన్నికల్లోనూ టీడీపీ, జనసేన కలిసే పోటీ చేశాయి. జడ్పిటీసీ స్థానంలో జనసేన అభ్యర్థి నిలబడ్డారు. మండల పరిషత్ పీఠం టీడీపీకి అని అనుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం పోటీ చేస్తే జడ్పీటీసీ అభ్యర్థి కూడా గెలిచారు. జనసేనకు వచ్చిన రెండు జడ్పీటీసీల్లో ఒకటి కడియం. ఒప్పందం ప్రకారం కడియం మండల పరిషత్ టీడీపీకే ఇచ్చారు.