కూటమిలో భాగంగా జనసేన 21 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తోంది. అయితే మిగిలిన చోట్ల కూడా జనసేన గుర్తు ఈవీఎంలో కనిపించనుంది. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తును ఎన్నికల కమిషన్ ఫ్రీ సింబల్‌గా ప్రకటించింది. జనసేన పోటీ చేసే 21 స్థానాల్లోనే కాకుండా, మిగిలిన 154 స్థానాల్లో పోటీ చేసే ఇండిపెండెంట్లకి ఫ్రీ సింబల్ గా జనసేన గాజు గ్లాసు గుర్తుని కేటాయించాలని నిర్ణయించింది. ఎన్నికల కమిషన్ నిర్ణయం జనసేన నేతలు, కూటమి అభ్యర్థులకు ఇబ్బందికరమే.
జనసేన పోటీ చేయని చోట టీడీపీ, బీజేపీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. వారికి జనసేన ఓట్ల బదలాయింపు జరుగాల్సివుంది. ఆ స్థానాల్లో గాజుగ్లాసు గుర్తును ఇండిపెండెంట్లకు కేటాయిస్తే సరైన అవగాహాన లేని ఓటర్లు గాజు గ్లాసుకు ఓటు వేసే ప్రమాముందన్న ఆందోళన కూటమి నేతల్లో వ్యక్తమవుతుంది. అయితే జనసేన, బీజేపీ తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. ఆ సందర్భంలోనూ ఓ స్వతంత్ర అభ్యర్థి పట్టుబట్టి గాజు గ్లాస్ గుర్తు తెచ్చుకున్నారు. కానీ ఆయనకు రెండు,మూడు వేల ఓట్లు కూడా రాలేదు.
గుర్తులపై ప్రజలు స్పష్టతతో ఉంటారని.. జనసేన పోటీ లేకపోయినా గాజు గ్లాస్ గుర్తు ఉందని ఆ పార్టీకి ఓటు వేసే అవకాశం ఉండదని భావిస్తున్నారు. అయినా … ఓ వంద ఓట్లు అయినా అలా డైవర్ట్ అయితే.. ఇబ్బందికరం కాబట్టి ఈసీకి ప్రత్యేకమైన విజ్ఞప్తి చేసే ఆలోచనలో కూటమి పార్టీలు ఉన్నట్లుగా తెలుస్తోంది.