జనసేన పార్టీకి రాష్ట్రంలో కేవలం ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన కూడా అధికార పార్టీతో అంటకాగుతున్నారు. ప్రస్తుతం ఉన్న మీడియా అండ ఆ పార్టీకి ఏమాత్రం లేదు. ఇవి ఏమీ లేకపోయినా కూడా, తమ పార్టీకి బలం అయిన సోషల్ మీడియా తో వారు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నిన్న సాయంత్రం నుండి సోషల్ మీడియా లో సుగాలి ప్రీతి కి న్యాయం చేయాలంటూ జన సైనికులు విపరీతంగా ట్రెండ్ చేశారు. అయితే సోషల్ మీడియాలో అలా ట్రెండింగ్ చేయడం కూడా తప్పు అంటూ పోలీసులు చేసిన ఓవరాక్షన్ కర్నూలు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే..
పవన్ కళ్యాణ్ ఈ సమస్య టేకప్ చేసిన తర్వాత, ఈ కేసును సీబీఐకి అప్పగించిన జగన్
సుగాలి ప్రీతి అనే గిరిజన బాలిక పై అత్యాచారం జరిపి చంపేశారు. తాను చదువుతున్న విద్యాసంస్థల కి చెందిన వారే ఇది చేశారంటూ రూమర్స్ వచ్చాయి. తన బిడ్డకు న్యాయం చేయాలంటూ తన తల్లి ఎప్పటి నుండో పోరాడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అయితే ఈ సమస్య పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చిన తర్వాత, ఆయన కర్నూలులో సుగాలి ప్రీతి కోసం ర్యాలీ చేస్తానని, కేసును సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. యధావిధిగా పవన్ కళ్యాణ్ ప్రకటన కానీ, ఆయన ర్యాలీ గురించి కానీ న్యూస్ ఛానల్స్ కనీసపు స్క్రోలింగ్ కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ ప్రభుత్వ పెద్దలకు విషయం అర్థం కావడంతో, పవన్ కళ్యాణ్ పర్యటన కు సరిగ్గా ఒకరోజు ముందు జగన్ ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు సిబీఐకు అందజేయడం లేదని, ముఖ్యమంత్రి జగన్ సామాజిక వర్గానికి చెందిన వారు నిందితులుగా ఉండడంతో ప్రభుత్వ పెద్దలు ఈ కేసును తొక్కి వేయాలని చూస్తున్నారని సుగాలి ప్రీతి తల్లి ఆరోపిస్తున్నారు.
సుగాలి ప్రీతి కి న్యాయం కోసం జనసైనికుల సోషల్ మీడియా ట్రెండ్
అయితే సమస్యను మీడియా మర్చిపోయినా, కొందరు పెద్దలు కేసును తొక్కి వేయాలని చూస్తున్నా, జనసైనికులు మాత్రం ఈ సమస్యను లైమ్ లైట్ లో ఉంచుతూ, సుగాలి ప్రీతి తల్లి కి న్యాయం చేయించాలని కోరుతున్నారు. తమ పార్టీకి ఎమ్మెల్యేలు లేకపోయినా, మీడియా లేకపోయినా, సోషల్ మీడియా లో ట్రెండింగ్ చేయడం ద్వారా నిందితులకు, ఆ నిందితులను కాపాడుతున్న పెద్దలకు చుక్కలు చూపిస్తున్నారు. నిన్న సాయంత్రం 6:30 కు మొదలుపెట్టిన జనసైనికులు, కొద్ది గంటల్లోనే ఐదు లక్షలకు పైగా ట్వీట్ లని సుగాలి ప్రీతి కి న్యాయం చేయాలంటూ ట్రెండింగ్ చేశారు.
జనసేన నేతలను అదుపులోకి తీసుకుని, సుగాలి ప్రీతి తల్లి కి వార్నింగ్ ఇచ్చిన పోలీసులు
మీడియాలో ఎక్కడా గిరిజన బాలిక సుగాలి ప్రీతి కి జరిగిన అన్యాయం గురించి కథనాలు రాకుండా నిందితులు , పెద్దలు మేనేజ్ చేయగలిగారు కానీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ కాకుండా ఆపలేకపోయారు. దీంతో, నిన్న రాత్రి పోలీసులు రంగంలోకి దిగి కర్నూలు జనసేన నేత రేఖా రాణి ని అదుపులోకి తీసుకుని సిబిఐ పరిధిలో ఉన్న కేసుపై ట్రెండింగ్ చేయడం సరికాదంటూ హెచ్చరించారు. సుగాలి ప్రీతి తల్లి కూడా, సుగాలి ప్రీతి కి న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో కోరితే దానికి బదులుగా పోలీసులు తమకు వార్నింగులు ఇస్తున్నారని ఇదేం న్యాయమని ప్రశ్నించారు. సిబిఐ విచారణలో ఉండగా సోషల్ మీడియాలో ట్వీట్స్ చేయకూడదంటూ పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని జనసైనికులు విమర్శిస్తున్నారు.
జగన్ పై విరుచుకుపడ్డ సుగాలి ప్రీతి తల్లి:
అయితే సుగాలి ప్రీతి తల్లి జగన్ పై విమర్శలు కురిపించారు. తమ బిడ్డకు న్యాయం జరగడం లేదని, న్యాయం కోరితే పోలీసులు తమని బెదిరిస్తున్నారని ఇదేనా జగనన్న పాలన అంటే అని ఆవిడ విమర్శించారు. తన బతుకులను నడిరోడ్డు కు ఈడుస్తున్నారని ఆమె ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
మొత్తం మీద, కేవలం సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసినా కూడా పోలీసులు రంగంలోకి దిగి బెదిరిస్తున్నారు అంటే ఈ కేసుని అణిచేయాలని ఎంత పై స్థాయిలో నుంచి ప్రయత్నిస్తున్నారో అర్థమవుతుందని, ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు నిందితులుగా ఉండటంతోనే కొందరు పెద్దలు ఈ విధంగా చేస్తున్నారని విమర్శలు వస్తున్న నేపథ్యంలో సుగాలి ప్రీతి కి ఎప్పటికీ న్యాయం జరుగుతుందో వేచి చూడాలి.