జనసేన పార్టీ ఆవిర్భావ సభను మార్చి 14వ తేదీన పిఠాపురంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పదేళ్ల పాటు ఎన్నో ఇబ్బందులు పడిన తర్వాత జనసేన పార్టీ చిరస్మరణీయమైన విజయాలను అందుకుంది. అందుకే ఈ సారి ఆవిర్భావ వేడుకల్ని అత్యంత భారీగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు పిఠాపురం అయితేనే సరైన వేదిక అనుకున్న పార్టీ పెద్దలు వేదికను ఎప్పుడో ఖరారు చేశారు. ఇప్పుడు సమయం దగ్గర పడుతూండటంతో సన్నాహాలు ప్రారంభించారు.
పార్టీ ప్లీనరీతో పాటు ఆవిర్భావ సభను నిర్వహించే అవకాశం ఉంది. వందకు వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా జనసేన పార్టీ రికార్డులకు ఎక్కింది.ఈ విజయాన్ని నెత్తికెక్కించుకోకుండా..భవిష్యత్ లో పార్టీని మరింతగా బలోపేతం చేసుకునేలా చేయడం, రాష్ట్ర పునర్ నిర్మాణంలో జనసేన పార్టీ పోషించే పాత్రతో పాటు..సోషల్ మీడియా విషయంలో జనసైనికులు నిర్వర్తించాల్సిన బాధ్యతల విషయంపైనా ఈ వేదికగా దిశానిర్దేసం చేసే అవకాశం ఉంది.
పవన్ కల్యాణ్ తన పార్టీ భవిష్యత్ విషయంలో క్యాడర్ ను దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సారి కీలక ప్రకటనలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. గురి పెట్టిన లక్ష్యాన్ని అందుకునేలా సరైన దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే జనసేన ఆవిర్భావ సభ కోసం కమిటీలను నియమించారు.