పవన్ కల్యాణ్.. ఓటమిని అనుభవంగా తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. మాటల్లోనే కాదు.. చేతల్లోనూ ఆ స్ఫూర్తి కనబరిచారు. తన రివ్యూ మీటింగ్లో ఎక్కడా… ఓటమి అనే నీరసం భావన రాకుండా జాగ్రత్త పడ్డారు. పార్టీ నేతలందరిలోనూ.. స్ఫూర్తి నింపడంలో సక్సెస్ అయ్యారు. పవన్ కాన్ఫిడెన్స్ చూసి.. నేతలు స్థానిక ఎన్నికలను ఎదుర్కోవడానికి మరింత ధైర్యం తెచ్చుకున్నారు.
ఓటమిని అనుభవంగా తీసుకున్న జనసేనాని..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పట్టున్న నియోజకవర్గాల్లో సైతం ఓటమి పాలవ్వడంతో కేడర్ లో నిరుత్సాహాం నెలకొంది. పార్టీ పటిష్టత కోసం రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ ప్రణాళిక బద్ధంగా అడుగులేస్తున్నారు. జనసేన ఇక నుంచి ప్రజాపక్షాన నిలవనుంది. పవన్ కళ్యాణ్ పార్టీ పటిష్టత కోసం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దగ్గర్నుంచి వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అందరూ పనిచేయాలని జనసేనాని దిశానిర్ధేశం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు పార్టీకి దక్కినప్పటికీ, కేడర్ లో ఆత్మస్థైర్యం, ధైర్యం కోల్పోకుండా జనసేనాని కొత్త ఉత్సాహాన్ని నింపారు. జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించి, భవిష్యత్తు కార్యాచరణను వివరిస్తున్నారు.
జనసేనకు డబ్బు పంచకుండానే 16 లక్షల ఓట్లు..!
జిల్లాల వారీగా సమీక్షా సమావేశాల ద్వారా స్థానిక అంశాలపై చర్చించడంతోపాటు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్ధేశం చేస్తున్నారు. నాలుగేళ్ల వయసు గల జనసేన పార్టీకి 16 లక్షల మందికిపైగా ప్రజలు ఓటేసి ఆశీర్వదించడం, పట్టం కట్టడం శుభపరిణామమని జనసేన భావిస్తోంది. ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను పట్టించుకోకుండా పాజిటివ్ అంశాలతోనే ముందుకుసాగుతూ ప్రజా సమస్యలపై ఉద్యమిస్తూ ప్రజల్లో ఆదరణ సంపాదించాలని నాయకులకు పవన్ సూచించారు. ఇక నుంచి పవన్ కల్యాణ్ విరామం లేకుండా ప్రజా క్షేత్రంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి ప్రజల్లో ఆదరణ సంపాదించాలని నిర్ణయించుకున్నారు.
గ్రామస్థాయిలో జనసేన విస్తరణకు ప్రణాళికలు..!
గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేలా కార్యాచరణ రూపొందించాలని పవన్ కల్యాణ్ నేతలకు సూచించారు. ఇతర పార్టీ ధనాన్ని పంచితే.. తాము మాత్రం జీరో బేస్ పాలిటిక్స్ తోనే ముందుకు వెళ్లాలని డిసైడయ్యారు. పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ ను విస్తృతం చేయడంతో పాటు, జిల్లాల వారీగా నాయకత్వాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం అన్ని జిల్లా నేతలతోనూ సమీక్షలు నిర్వహించి.. పార్టీని పటిష్టపరిచేలా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. ఈ ఎన్నికలలో ధన బలం బాగా పని చేసిందని, డబ్బు పంచకుండా 16లక్షలకు పైగా ఓట్లు జనసేన సాధించిందని, ఇదే అంశాన్ని తాము గొప్పగా చెప్పుకుంటామని జనసేన నమ్మకంగా చెబుతోంది.
ఓ వైపు… ఓటమి షాక్ నుంచి టీడీపీ ఇంకా తేరుకోలేకపోయింది. కానీ .. జనసేన క్యాడర్ మాత్రం.. భవిష్యత్ పై ధైర్యంతో ముందడుగు వేస్తోంది.