రెండు రోజుల కిందట చంద్రబాబు, జనసేన పార్టీతో టిడిపి కలిసి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే విషయంపై స్పందించిన నాటి నుంచి ఇప్పటికీ ఇటు సోషల్ మీడియాలో, అటు రాజకీయ వర్గాల్లో టిడిపి జనసేన పొత్తు అనే అంశం గురించి చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఆ మధ్య జనసేన పార్టీలో చేరిన నేత, ఆంధ్రప్రభ పత్రిక అధినేత ముత్తా గోపాలకృష్ణ ఈ అంశంపై వెరైటీగా స్పందించారు.
ఈరోజు ఒక టీవీ ఛానల్ డిబేట్ లో లైవ్ ఫోన్ కాల్ లో అందుబాటులోకి వచ్చిన ముత్తా గోపాలకృష్ణ ఈ అంశంపై మాట్లాడుతూ, చంద్రబాబుకు ఏవో కొన్ని సమస్యలు ఉన్నట్లు ఉన్నాయని, ఆ సమస్యల నుంచి బయట పడటం కోసం రాజకీయ అధికారం మళ్లీ తప్పనిసరిగా సాధించవలసిన పరిస్థితిలో ఆయన ఉన్నట్టుగా కనిపిస్తోందని, బహుశా అందుకే పవన్ కళ్యాణ్ తో పొత్తు కోసం ఆఫర్ ఇస్తున్నాడని వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబుకు నిజంగా పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోవాలన్న ఉద్దేశ్యం ఉంటే పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి, తాను జాతీయ రాజకీయాల వైపు వెళతానని చంద్రబాబు ప్రకటించాలని ఆయన అన్నారు. అయితే ముత్తా గోపాలకృష్ణ వ్యాఖ్యలు చూస్తుంటే చంద్రబాబు అలా ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ని ప్రకటించడు కాబట్టి కావాలనే , చంద్రబాబు ప్రకటనలోని డొల్లతనాన్ని బయటికి తెలియజేసే ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లుగా అనిపిస్తుంది.
అయితే మరో పక్క పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఈ అంశంపై స్పందించిన విషయం తెలిసిందే. 175 స్థానాల్లో జనసేన సంపూర్ణంగా పోటీ చేస్తున్నట్లు, వామపక్షాలతో తప్ప మరెవరితోనూ కలిసి వెళ్ళకుండా యువతకు ఎక్కువ అవకాశాలు ఇస్తూ పోటీ చేయనున్నట్టు పవన్కళ్యాణ్ ట్విట్టర్ లో పేర్కొన్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రకటన తర్వాత కూడా ఈ రోజు కూడా పలు ఛానల్ లో ఈ అంశంపై చర్చ కార్యక్రమాలు జరిగాయి. అందులో భాగంగా ఒక కార్యక్రమంలో గోపాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.