పవన్ కళ్యాణ్ నిన్నటి తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అనుకున్న సమయం కంటే మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభం అయినప్పటికీ వేలాదిగా జనాలు తరలి వచ్చారు. ఇవాళ అనేక టీవీ ఛానల్స్ లో పవన్ సభ ప్రభావం ఎంత ఉంటుంది అన్నదానిపై చర్చ జరిగింది. చర్చలో భాగంగా జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ, నిన్న అర్ధరాత్రి జగన్ అత్యవసర సమావేశం జరిపారని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగించాయి. వివరాల్లోకి వెళితే..
ముందుగా పవన్ సభ, దాని ప్రభావం అన్న అంశంపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పందించారు. ఆయన మాట్లాడుతూ- పవన్ సభలకు జనాలు రావడం కొత్త కాదని, ఆయన ఉపన్యాసాలకు అభిమానులు విజిల్స్ వేయడం కూడా కొత్త కాదనీ, కానీ ఆ వచ్చిన జనాలు జనసేన పార్టీకి కానీ బిజెపి పార్టీకి కానీ ఓట్లు వేయరు అని, ఆ విషయం బిజెపి జనసేన నేతలు అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. పవన్ సభ ప్రభావం ఏమాత్రం ఉండదు అని తెలుసు కాబట్టి తమ వైఎస్ఆర్సిపి పార్టీ ఆ సభకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని కూడా ఆయన అన్నారు.
అయితే జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఇదే డిబేట్లో మాట్లాడుతూ, మల్లాది విష్ణు కి కౌంటర్ ఇచ్చారు. పవన్ సభ ప్రభావం ఉండదు అని మల్లాది విష్ణు అంటున్నారని, కానీ పవన్ సభ జరిగిన తర్వాత ఐదుగురు రెడ్లు అర్ధ రాత్రి అత్యవసరంగా సమావేశం అయిన సంగతి మల్లాది విష్ణు కి బహుశా తెలియకపోవచ్చు అని బొలిశెట్టి అన్నారు. ఇంతకీ ఎవరు ఆ అయిదుగురు రెడ్లు అని యాంకర్ ప్రశ్నించగా, ఆ అయిదుగురు మరెవరో కాదు జగన్ మోహన్ రెడ్డి, మరియు ఆయన కోర్ గ్రూపులో ఉన్న మిగిలిన నలుగురు రెడ్లు అని ఆయన చెప్పుకొచ్చారు. పవన్ సభ ప్రభావం ఏ మేరకు ఉంటుంది, దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అన్న అంశాలపై జగన్ నిర్వహించిన ఆ సమావేశంలో చర్చ జరిగింది అన్న సమాచారం తమ వద్ద పక్కాగా ఉందని, అంతగా కావాలనుకుంటే మల్లాది విష్ణు, వై ఎస్ ఆర్ సి పి పార్టీ ముఖ్యులతో దీన్ని క్రాస్ వెరిఫై చేసుకోవాలని బొలిశెట్టి సత్యనారాయణ వ్యాఖ్యానించగా, ఆయన వ్యాఖ్యలను మల్లాది విష్ణు ఖండించ లేకపోయారు.
పవన్ వ్యాఖ్యలపై దీటుగా దాడి చేయలేకపోతున్న వైఎస్ఆర్ సీపీ నేతలు:
అంతేకాకుండా వై ఎస్ ఆర్ సి పి నేతల గుండాయిజం పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల భాష ఆకు రౌడీల స్థాయిలో ఉంది అని పవన్ కళ్యాణ్ నిన్న వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పరుష పదజాలంతో విరుచుకుపడితే, పవన్ చెప్పిన గుండాయిజం వ్యాఖ్యలు నిజం చేసినట్లు అవుతుంది అన్న మీమాంసలో వైఎస్ఆర్సిపి నేతలు ఉన్నట్లు సమాచారం. అందుకే భూమన కరుణాకర్ రెడ్డి వంటి తిరుపతి వైఎస్ఆర్ సీపీ నేతలు, తాము గుండాయిజం చేశామని పవన్ కళ్యాణ్ నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు తప్పించి, ఇంతకుముందు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వంటి వైఎస్ఆర్ సీపీ నేతలు పవన్ కళ్యాణ్ పై బూతు లతో విరుచుకుపడ్డట్టు గా ఇప్పుడు పవన్ పై విరుచుకు పడటానికి వైఎస్ఆర్ సీపీ నేతలు సందేహిస్తున్నారు.
బీజేపీ-జనసేన జైత్రయాత్ర పేరిట జరిగిన ప్రచార సభ గ్రాండ్ సక్సెస్ అయిందని, బిజెపి జనసేన అభిమానుల్లో జోష్ తీసుకురావడమే కాకుండా, సామాజిక సమీకరణలను బిజెపి అభ్యర్థి కి అనుగుణంగా మార్చడంలో సక్సెస్ అయ్యామనే ఆనందములో ప్రస్తుతం బిజెపి నేతలు ఉన్నారు. అంతేకాకుండా తిరుపతి ఎంపీ నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ బూత్ ల డేటా ని తెప్పించుకుని, బూత్ స్థాయిలో సోషల్ ఇంజనీరింగ్ చేస్తూ ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బిజెపి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిజెపి అవకాశాలపై, దాన్ని ఎదుర్కొనే వ్యూహాలపై, పవన్ సభ ప్రభావం పై జగన్మోహన్ రెడ్డి తన అంతరంగికుల తో నిన్న అర్ధరాత్రి ప్రత్యేక సమావేశం జరిపాడు అన్న సమాచారం, రాజకీయ విశ్లేషకుల కి ఆసక్తి కలిగిస్తోంది.