స్పీకర్ కోడెల శివప్రసాద్ నియోజకవర్గంలో, స్పీకర్ కుటుంబ సభ్యుల అవినీతిని వ్యతిరేకిస్తూ చేసిన దీక్ష అరెస్టులకు, ఉద్రిక్తతకు దారి తీసింది. జనసేన నేతలతో పాటు, విపక్ష నేతలు కూడా అరెస్టయ్యారు. వివరాల్లోకి వెళితే..
జనసేన నేత బై రా దిలీప్ చక్రవర్తి ఆధ్వర్యంలో స్పీకర్ మరియు తన కుటుంబం నియోజకవర్గంలో చేస్తున్న అవినీతికి వ్యతిరేకంగా అంటూ దీక్ష మొదలు పెట్టారు. జన సేన పార్టీ ఆఫీసు నుండి తాలూకా ఆఫీస్ వరకు ర్యాలీ చేశారు. జనసేన తో పాటు విపక్షాల నాయకులు కూడా ఇందులో పాల్గొన్నారు. అటు కమ్యూనిస్టుల తో పాటు ఇటు వైఎస్ఆర్సిపి నేత అంబటి రాంబాబు కూడా పాల్గొన్నారు. అయితే జనసేన నేతలు మొదలుపెట్టిన ఈ ర్యాలీకి ఊహించిన దానికంటే విపరీతంగా జనాలు రావడంతో, పోలీసులు రంగప్రవేశం చేశారు. ర్యాలీకి అనుమతి లేదని, దీక్షకు అనుమతి లేదని చెప్పి , దిలీప్ చక్రవర్తితో పాటు ఇతర నాయకులను కూడా అరెస్టు చేశారు.
బైరా దిలీప్ చక్రవర్తి, మాజీ బ్యూరోక్రాట్. ప్రజారాజ్యం పార్టీ సమయంలోనే రాజకీయాల్లో ప్రవేశించి ఇదే సత్తెనపల్లిలో పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇప్పుడు జనసేన పార్టీలో చేరి ఇటీవలే రీజినల్ కమిటీ కో ఆర్డినేటర్ గా నియమింపబడ్డారు. జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ దీక్ష పోలీసులు భగ్నం చేసినప్పటికీ, ఈ ర్యాలీకి నియోజకవర్గం లో వచ్చిన స్పందన విపక్ష నాయకులు అందరిని ఆశ్చర్యానికి లోను చేసింది.